కుక్కను చంపాలంటే అది పిచ్చింది అని ముద్రవేయాలి అన్నది నానుడి. జగన్ ను గద్దె దించాలంటే…అవినీతి పరుడు, పాలన చాతకాదు..రాష్ట్రం నాశనం అయిపోతోంది..లాంటి ప్రచారం ఎలాగూ సాగిస్తున్నారు. కానీ భాజపా అండ వుంది..కేసిఆర్ అండ వుంది. వాటిని కూడా కట్ చేయాలి. అలా కట్ చేస్తేనే, ఆండ దండ తేదేపాకు వస్తాయేమో? ఈ దింపుడు కళ్లెం ఆశ ఒకటి వుంది కదా? అందుకే కావచ్చు. సదా ఇలాంటి రాతలు కొన్ని కనిపిస్తుంటాయి.
‘’….కేంద్ర పెద్దల ఆశీస్సులు జగన్కు లభిస్తే మాత్రం తెలంగాణలో దాని ప్రభావం బీజేపీ విజయావకాశాలపై ఉంటుంది. తెలంగాణలో దాదాపు 25 నియోజకవర్గాల్లో సీమాంధ్రుల సంఖ్య గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అడుగంటడానికి కారణమైన జగన్కు కేంద్ర పెద్దలు చేయూత ఇవ్వడాన్ని తెలంగాణలోని సీమాంధ్రులు జీర్ణించుకోలేరు. ఈ విషయమై తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కూడా సీమాంధ్రులు బీజేపీని ఆదరించలేదు. సెటిలర్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కూడా అంత సానుకూలంగా లేరు. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు తీసుకునే నిర్ణయాలను బట్టి సెటిలర్ల నిర్ణయం ఉంటుంది…’’
తెలంగాణలోని 25 నియోజకవర్గాల్లో సీమాంధ్రులు గణనీయసంఖ్యలో వుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎక్కడా కూడా గెలవలేకపోయింది? జగన్ పార్టీ ఎలాగూ పోటీ చేయలేదు. మరి వాళ్లంతా కేసిఆర్ పార్టీకి కాకుండా చంద్రబాబు పార్టీకి ఓట్లు వేయాలి కదా? ఈ సంగతి తెలిసి కూడా మరుగున పెట్టి భాజపాను భయపెట్టే ప్రయత్నం. కానీ భాజపా నాయకత్వం ఏమైనా చిన్నపిల్లలా? ఈ మీడియా టక్కు టమార విద్యలు అన్నీ వాళ్లకీ తెలుసు కదా?
భాజపాను ఆ విధంగా బెదరకొడితే కేసిఆర్ ను కూడా భయపెట్టే ప్రయత్నం చేసారు. అది ఎలా..?
‘’….జగన్మోహన్ రెడ్డి పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ నాశనం కావడాన్ని సీమాంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి రావడానికి కేసీఆర్ కూడా కారణమని వారు బలంగా నమ్ముతున్నారు. జగన్ తనకు పెద్దన్న వంటివాడని కేటీఆర్ ఇటీవల ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది…’’
అంటే జగన్ మీద కోపం కేసిఆర్ మీద తీర్చుకుంటారా? అలా తీర్చుకునే ఉద్దేశం, శక్తి వుంటే ఓటుకు నోటు అనే కేసును వాడడం ద్వారా చంద్రబాబును ఆంధ్రకే కట్టడి చేయగలిగారు కదా. అప్పుడే ఈ కోపం చూపించి వుండాలి కదా? కేసిఆర్ మీద? మరి ఎందుకు చూపించలేదు?
మన ఆలోచనలు జనం మీద రుద్దే ప్రయత్నాలు అంత సులువుగా నెరవేరవు. ఎందుకంటే సెటిలర్లు ఏనాడో తెలంగాణలో భాగం అయిపోయారు. వాళ్లకు కూడా స్థానిక బంధాలు ఏర్పడుతున్నాయి. టీఆర్ఎస్ తో కూడా అనుబంధం పెరుగుతోంది. భాజపాతో వుండే బంధం కొందరికైనా వుంది. తేదేపా పోటీ చేస్తుందా? అన్నది అనుమానమే. అందువల్ల ఇలాంటి బెదిరింపులు పనికి వచ్చే అవకాశం తక్కువే.