స్కూల్ పిల్లల్ని కూడా తన రాజకీయాల్లో పావులుగా వాడుకోవాలని చూస్తూ చంద్రబాబు మరీ దిగజారి పోయారని విమర్శించారు మంత్రి కొడాలి నాని.
కరోనా టైమ్ లో స్కూళ్లు తెరిచారు కదా, స్థానిక ఎన్నికలు ఎందుకు జరపకూడదని టీడీపీ నేతలు చెత్త లాజిక్ లు తీస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే విద్యార్థులు చాలా రోజులు నష్టపోయారని, ఇంకా స్కూల్స్ తెరవకపోతే విద్యా సంవత్సరం మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే స్కూళ్లు తెరిచామని అన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినే అవకాశం లేదని, పేదింటి వాళ్లకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో లేదని, అందుకే తల్లిదండ్రుల అనుమతి తీసుకునే స్కూళ్లు పునఃప్రారంభించామని చెప్పారు.
ఆన్ లైన్ క్లాసులు వినే అవకాశం ఉన్నవారికి మినహాయింపు ఇస్తున్నామని, హాజరు నిబంధన కూడా లేదని వివరించారు. అయితే చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ మాత్రం స్కూళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు నాని.
ఇప్పటిప్పుడు స్థానిక ఎన్నికలు జరక్కపోతే వచ్చే ముప్పేమీ లేదని, క్లాసులు జరక్కపోతే మాత్రం విద్యార్థులు విద్యా సంవత్సరం వెనకపడిపోతారని చెప్పారు. ఎన్నికలు లేకపోయినా కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఆటంకం లేదని వివరించారు.
స్థానిక ఎన్నికలు జరిపితే.. ఓటర్లు కనీసం నాలుగైదు బ్యాలెట్లను పట్టుకోవాల్సి వస్తుందని, కరోనా వ్యాపించడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పారు నాని.
ఉద్యోగులు కూడా ఎన్నికల విధులకు సుముఖంగా లేరని, వారి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విషయంలో సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కోర్టులు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
అడ్డమైనవారి కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుకి అలవాటని, అందుకే మోదీతో జగన్ లాలూచీ పడ్డారంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
కేసులకి భయపడి మోదీతో సయోధ్య కుదుర్చుకునే వ్యక్తి అయితే.. ఆనాడు సోనియాతోనే జగన్ రాజీ పడేవారని, కానీ మాటమీద నిలబడి ఆత్మగౌరవంతో ఉండే వ్యక్తి జగన్ అని అన్నారు మంత్రి కొడాలి. కేవలం జనం మెప్పు కోసమే ఆయన తపనపడతారని చెప్పారు.