సీఎం జగన్ తిరుమల పర్యటనపై చంద్రబాబు నీఛ రాజకీయాలు చేస్తున్నారంటూ మరోసారి ధ్వజమెత్తారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు బూట్లు వేసుకుని తిరుమల కొండపైకి కార్లో వెళ్తే, సీఎం జగన్ వట్టి కాళ్లతో నడకదారిన వెళ్లి మొక్కు చెల్లించుకున్నారని గుర్తు చేశారు.
వీరిద్దరిలో శ్రీవారిపై విశ్వాసం, భక్తి.. ఎవరికి ఎక్కువో, ఎవరు డిక్లరేషన్ ఇచ్చి గర్భగుడిలో ప్రవేశించాలో నిర్ణయించుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని చంద్రబాబు హిందువా? ఎడమ చేత్తో భూమి పూజ చేసే చంద్రబాబు దంపతులు హిందువులా? అసలు జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు తిరుమలలో గుండు కొట్టించుకున్నారా?” అని ప్రశ్నించారు నాని. తిరుమల వెళ్లి తలనీనాలు సమర్పించని చంద్రబాబుకి.. తిరుమల ఆలయం గురించి, జగన్ ఆలయ ప్రవేశం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
గతేడాది జగన్ తిరుమలకు వెళ్లి సీఎం హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేసిన నాని, ఏడాది కాలంలోనే ఏం మార్పు జరిగిందని బాబును ప్రశ్నించారు. ఇక తనపై వస్తున్న విమర్శలకు కూడా నాని గట్టిగానే సమాధానం ఇచ్చారు.
తాను ఏనాడూ దేవుళ్లని కించపరిచేలే మాట్లాడలేదని, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అయిన సంఘటనపై తన వ్యాఖ్యలను టీడీపీ అనుకూల మీడియా వక్రీకరించిందని, సోషల్ మీడియాలో కూడా తనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
తన మెడలో అన్ని మతాలకు సంబంధించిన దండలు ఉంటాయని, అన్ని మతాల ప్రజలు ఓట్లు వేస్తేనే తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తనకు అన్ని మతాలు సమానమేనని అన్నారు.
ముఖ్యమంత్రి కాక ముందు జగన్ చాలాసార్లు తిరుమల వెళ్లారని, సీఎం హోదాలో కూడా వెళ్లారని, భవిష్యత్ లో కూడా వెళ్తారని స్పష్టం చేసిన నాని… టీడీపీ, బీజేపీ హిందువుల పేరుతో మతరాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.