తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మోకా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రవీంద్రపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తనపై కేసు నమోదైందనే ప్రకటన వచ్చాకా రవీంద్ర పరారీలో ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. బందరు నుంచి ఆయన విశాఖ వైపు పరారీ అవుతుండగా అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. మోకా భాస్కరరావు హత్య కేసులు ఉన్న ఆధారాలను బట్టే కొల్లు రవీంద్రను అరెస్టు చేసినట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకటించారు.
శుక్రవారం మధ్యాహ్నమే కొల్లు రవీంద్రను అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన అప్పటికే అక్కడ నుంచి వెళ్లిపోయినట్టుగా సమాచారం. దీంతో పోలీసులు ఇతర జిల్లాల పోలీసులను కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన విశాఖ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందిందట. మొబైల్ సిగ్నల్స్ ద్వారా ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద ఉండగా ఆ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణా జిల్లా పోలీసులకు అప్పగించినట్టుగా సమాచారం. అనంతరం కొల్లు రవీంద్రను విజయవాడకు తరలించినట్టుగా తెలుస్తోంది.
మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అయిన మోకా భాస్కరరావును హత్య చేసి వచ్చినా అంతా తను చూసుకుంటానంటూ హతుడి రాజకీయ ప్రత్యర్థులకు కొల్లు రవీంద్ర అభయం ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు కేసు నమోదు అయ్యింది. పక్కా ఆధారాలు ఉండటంతోనే రవీంద్రను అరెస్టు చేసినట్టుగా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఏకంగా హత్య కేసులో ఒక తెలుగుదేశం నేత కమ్ మాజీ మంత్రి అరెస్టు కావడం విశేషం.