మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? …ఇప్పుడీ చర్చ తెలంగాణలో విస్తృతంగా సాగుతోంది. ఆయన్ను మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిసి చర్చించిన నేపథ్యంలో, ఆ ప్రచారానికి మరింత బలం వచ్చింది. మరో వైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలకు గాలం వేసేందుకు రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా 2023లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలనే క్రమంలో రేవంత్‌రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో బలమైన ఆర్థిక, అంగబలం ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డిని కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు రేవంత్‌రెడ్డి కీలక చర్చలు జరిపారనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా ఇంటికి రేవంత్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొదట టీఆర్ఎస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొండా విశ్వేశ్వరరెడ్డి … ఆ పార్టీలో ఇమడలేక పోయారు. దీంతో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని భావించిన ఆయన …నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీలో కొండా విశ్వేశ్వరరెడ్డి చేరుతారని విస్తృత ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఒక దశలో ఈటల రాజేందర్‌తో కలిసి సొంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరిగింది. ఈటల రాజేందర్‌తో కొండా విశ్వేశ్వరరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదం డరాం చర్చలు జరిపారు. అయితే అవేవీ సానుకూల ఫలితాలు ఇవ్వలేదు. ఆ వెంటనే బీజేపీలో ఈటల చేరారు.
ఇదిలా ఉండగా టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీకి ఉపయోగపడతారనే నాయకులపై రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేసి, ఎందులోనూ చేరని కొండా విశ్వేశ్వరరెడ్డిని మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ పావులు కదుపుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్‌లో చేరేందుకు తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు తనతో టచ్‌లో ఉన్నట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ తనను ముగ్గురు నేతలు కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారన్నారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు, నిజమాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ముదిరాజ్, భూపాల్‌పల్లికి చెందిన టీడీపీ మాజీ నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరనున్నారని రేవంత్ తెలిపారు.
ఈ ముగ్గురు వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నాయకులతో సమావేశం అంటే పార్టీ లో చేరిక కోసమే అన్నట్టు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం నెలకుంది. అందుకే కొండా విశ్వేశ్వరరెడ్డితో రేవంత్‌రెడ్డి సమావేశం కావడంపై కూడా అలాంటి ప్రచారమే జరుగుతోందని చెప్పొచ్చు.