ఒకసారి నో అన్నా …ఆ తరువాత ఓకే అనక తప్పదు !

మన దేశంలో కేంద్రంలో రాష్ట్రపతి కంటే, రాష్ట్రంలో గవర్నర్ కంటే ప్రధాని, ముఖ్యమంత్రే పవర్ ఫుల్. అంటే మంత్రివర్గ నిర్ణయాలను (వాస్తవానికి ప్రధాని, ముఖ్యమంత్రి నిర్ణయాలే) కాదని రాష్ట్రపతిగానీ, గవర్నరుగానీ ఏమీ చేయలేరు. అందుకు…

మన దేశంలో కేంద్రంలో రాష్ట్రపతి కంటే, రాష్ట్రంలో గవర్నర్ కంటే ప్రధాని, ముఖ్యమంత్రే పవర్ ఫుల్. అంటే మంత్రివర్గ నిర్ణయాలను (వాస్తవానికి ప్రధాని, ముఖ్యమంత్రి నిర్ణయాలే) కాదని రాష్ట్రపతిగానీ, గవర్నరుగానీ ఏమీ చేయలేరు. అందుకు రాజ్యాంగమే వెసులుబాటు కల్పించింది. 

కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటే లేదా చట్ట సభలో ఒక బిల్లు పాస్ చేస్తే ఏదైనా కారణాలవల్ల అభ్యంతరం చెప్పినా, వెనక్కి తిరిగి పంపినా ఆ అవకాశం ఒక్కసారే. తిరిగి రెండోసారి పంపితే తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే కౌశిక్ రెడ్డి పేరు విన్నారు కదా. 

ఎప్పుడైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారం మొదలైందో అప్పుడే కౌశిక్ రెడ్డి తెర మీదికి వచ్చాడు. ఈ కాంగ్రెస్ నాయకుడు అనూహ్యంగా గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా పోటీ చేశాడు. గట్టి పోటీ ఇచ్చినా ఓడిపోయాడు. 

కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయానికి అధికార పార్టీలో చేరిపోయాడు. వెంటనే కేసీఆర్ కౌశిక్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. టీఆర్ఎస్ తరపున కేసీఆర్ ఈయన్నే నిలబడతారని ఆయనా అనుకున్నాడు. రాజకీయ వర్గాలూ అనుకున్నాయి. కానీ రాజకీయ కారణాల వల్ల అది కుదరలేదు. వెంటనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేశారు కేసీఆర్.

ఒకవేళ ఉప ఎన్నికలో పోటీ చేసి ఉంటే గెలుస్తాడో, గెలవాడో ఎవరికీ తెలుసు? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అంటే నేరుగా చట్ట సభలోకి వెళ్లిపోవడమే కదా. కౌశిక్ రెడ్డి అదృష్టానికి టీఆర్ఎస్ నాయకులు కుళ్ళుకున్నారు. అదృష్టం అరచేతి మందం పట్టిందని అనుకున్నారు. 

కానీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కరుణించలేదు. ఆమె ఇప్పటివరకు ఆమోద ముద్ర వేయలేదు. దీంతో కౌశిక్ రెడ్డి ప్రతిపాదిత ఎమ్మెల్సీగానే ఉండిపోయాడు. లేకపోతే ఎమ్మెల్సీ హోదాలో ఎన్నికల ప్రచారం చేసేవాడే. ప్రస్తుతానికి గవర్నర్ కౌశిక్ రెడ్డి ఫైల్ ను పక్కకు పెట్టినా పర్మినెంటుగా అలా చేయడం సాధ్యం కాదు. 

అసలు గవర్నర్ కోటాలో ఎలాంటి వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు ? మేధావులు, సామాజిక సేవకులు. కళాకారులు, ఏదైనా రంగంలో విశిష్ట వ్యక్తులు, క్రీడాకారులు, రచయితలు, కవులు …ఇలాంటి వారికి అవకాశం ఇస్తారు. 

ఎందుకంటే వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేరు కాబట్టి. అందులోనూ వారి సలహాలు, సూచనలు విలువైనవిగా ఉంటాయి. కానీ కౌశిక్ రెడ్డి మనం చెప్పుకున్న ఏ కేటగిరిలోకీ రాడు. 

ఆయన సాదా సీదా రాజకీయ నాయకుడు. ఆయన చట్ట సభలోకి రావాలంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. లేదా ఎమ్మెల్సీ కావడానికి వేరే కోటాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ ఆగమేఘాల మీద గవర్నర్ కోటాలో నామినేట్ చేశారు. ఇది గవర్నర్ కు నచ్చలేదు. సమాజ సేవలో ఉన్నవారికి ఇచ్చే పదవి ఇది కాబట్టి అయన సేవాకార్యక్రమాలపై విచారణ చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్  స్పష్టం చేశారు.

అయితే అది ఎప్పుడు అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ గవర్నర్ ఈ ఫైల్‌ను వెనక్కి పంపితే..మళ్లీ రెండోసారి అదే పేరుతో పంపే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అప్పుడు గవర్నర్ తప్పక ఆమోదించాల్సి వస్తుంది. ఎందుకంటే  అది రాజ్యాంగ నిబంధన కాబట్టి. మరి ఇక్కడ అలా జరుగుతుందా అంటే చెప్పలేం. 

గవర్నర్ ఇంకా జాప్యం చేస్తే ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ గవర్నర్ కు సిఫార్సు చేయవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఉప ఎన్నిక బిజీలో ఉన్నారు కాబట్టి అది అయ్యాక కౌశిక్ రెడ్డి ఇష్యూ టేకప్ చేసే అవకాశం వుంది. ఒక విధంగా చూస్తే కౌశిక్ రెడ్డికి ఇంకా అవకాశం ఉందనే అనుకోవాలి.