తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో హైదరాబాద్ ఒక్కదాన్నీ వేరుగా చూడాలి. రాష్ట్రం మొత్తం ప్రతిబింబించిన ఫలితాలు.. బల్దియా ఎన్నికల్లో కనపడతాయని అంచనా వేయలేం.
మహానగరంలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు, పాతబస్తీలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓటర్లు.. జాతకాలు తారుమారు చేయగలరు. అందుకే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలంటే తెగ టెన్షన్ పడిపోతుంటుంది. ఆంధ్రప్రదేశ్ పై లేనిపోని ప్రేమ ఒలకబోస్తుంది.
ఇక తాజా ఎన్నికల విషయానికొస్తే.. 2021 జనవరిలోగా బల్దియాకి కొత్త నాయకత్వం రావాల్సి ఉంది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో అనుకోని వర్షాలు, వరదలు.. హైదరాబాద్ ని అతలాకుతలం చేశాయి.
పనిలో పనిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఆ బురద బాగానే అంటుకుంది. నగరంలో సంభవించిన వరదలపై ప్రభుత్వం వేగంగా స్పందించి, సహాయక చర్యలు చేపట్టింది. వరద సహాయం పంపిణీలో కూడా పెద్ద నాయకులు జేబులో డబ్బు తీసిచ్చారు.
అయితే వరద సాయం పంపిణీలో స్థానిక నాయకత్వం చేతివాటం చూపించింది. 10వేలు సాయం అందించి అందులో 5వేలు లంచంగా తీసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అధికార పార్టీ నేతలు, అధికారులు చేయకపోయినా.. వారి పేరు చెప్పుకుని కొంతమంది వసూళ్లకు తెగించడంతో, ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. మీడియా ఎలాగూ తమదే కాబట్టి మేనేజ్ చేయగలిగారు కానీ, ప్రజాగ్రహాన్ని మాత్రం టీఆర్ఎస్ చవి చూసింది.
మామూలుగా అయితే ఇలాంటి వ్యవహారాన్ని కేసీఆర్ లైట్ తీసుకుంటారు. అయితే రెండు మూడు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో.. ఇప్పుడీ తలనొప్పి కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికీ కంబైన్డ్ గా వచ్చింది.
150 సీట్ల బల్దియాలో టీఆర్ఎస్ కి 99మంది కార్పొరేటర్ల బలం ఉంది. వీరిలో దాదాపు 50 శాతం మందికి అవినీతి మరక అంటింది. కొత్తగా కార్పొరేటర్ గా ఎన్నికైనవాళ్లంతా ఐదేళ్లలో వ్యవహారాలన్నీ బాగానే చక్కదిద్దుకున్నారు. దీంతో స్థానికంగా వీరిపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది.
వరదసాయం పంపిణీ కోసం ప్రజల్లోకి వెళ్లిన కార్పొరేటర్లకు ఎదురైన చీత్కారాలే దీనికి సాక్ష్యం. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలపై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు తిరగబడుతున్న ఈ సమయంలో.. ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ బాగా దిగులు పెట్టుకున్నారు.
2016లో జరిగిన ఎన్నికల్లో అన్నీ తానై ముందుండి నడిపారు కేటీఆర్. ఇక ఇప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ టార్గెట్ 100 స్థానాలు. అంతకంటే ఎక్కువ సాధించాలన్నా ఎంఐఎం ఉండగా అది కుదరని వ్యవహారం అనుకోండి.
అయితే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ కి దక్కిన ఒకటీ అరా స్థానాలు కూడా వారికి కాకుండా చేయాలనేది టీఆర్ఎస్ ఆలోచన. బల్దియా ఎన్నికల్లో సెంచరీ కొట్టి ఆ తర్వాత అదే ఊపులో సీఎం పీఠం అధిష్టించాలనేది కేటీఆర్ కల.
అయితే సెంచరీ కాదు కదా.. ఉన్నసీట్లలో కోత పడుతుందేమోనని ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ప్రజా వ్యతిరేకత ఎలాగూ ఉంది, దానికి తోడు వరదలతో మరింత చెడ్డపేరు వచ్చింది. ఆక్రమణలు తొలగించలేకపోయారని, ప్రభుత్వ ఉదాసీనత వల్లే వరదలతో తీవ్ర నష్టం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఫ్లై ఓవర్లు కట్టి ప్రజల్ని ఆకర్షించాలనే ఎత్తుగడ ఒకే ఒక్క వరదతో కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ప్రజల ఆదరణ ఎలా సంపాదించాలనేదే ఇప్పుడు టీఆర్ఎస్ ముందున్న అతి పెద్ద సవాల్.
పనిలో పనిగా.. హైదరాబాద్ లో అల్లర్లకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆ పార్టీపై పెద్ద బండరాయి వేశారు. ముస్లిం ఓటర్లను ఆకర్షించడం కోసం బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడం సబబే కానీ, వాటి వల్ల మైనార్టీల ప్రాబల్యం ఉన్న ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడదనేది మాత్రం కాదనలేని వాస్తవం.
మొత్తమ్మీద ఈ దఫా గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్ కి నల్లేరుపై నడక కాదనేది మాత్రం బహిరంగ రహస్యం. గ్రేటర్ లో విజయం సాధించి తన సత్తా నిరూపించుకోలేకపోతే కేటీఆర్ కు పొలిటికల్ గా విమర్శలు తప్పకపోవచ్చు.
మరీ ముఖ్యంగా కొడుకును వీలైనంత త్వరగా ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్న కేసీఆస్ కు ఆ ముచ్చట ఇప్పట్లో తీరకపోవచ్చు.