ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నెగ్గాలంటూ కొందరు కాషాయధారులు పూజలు చేస్తూ ఉన్నారు! యజ్ఞయాగాలు చేస్తూ.. ట్రంప్ విజయాన్ని వీరు కాంక్షిస్తున్నారు. ట్రంప్ తో పాటు మోడీ ఫొటోలను పెట్టి వీళ్లు పూజలు సాగిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నెగ్గాలంటూ మోడీ భక్తులు తెగ ఇదైపోతున్నారు. ఏకంగా యజ్ఞాలు, యాగాల వరకూ వెళ్లింది వ్యవహారం. వీరి ఆశ నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. మోడీ భక్తులు ఇలా ట్రంప్ కోసం ఇంతగా ఇదైపోతుంటే ఇండియాకు కోపం వచ్చే పని చేశాడు ట్రంప్ తనయుడు. తన తండ్రి విజయాన్ని ప్రపంచంలోని ఏయే దేశాలు కోరుకుంటున్నాయో చెబుతూ.. ఇండియాను ట్రంప్ ఓటమిని కాంక్షించే దేశంగా అతడు పేర్కొన్నాడు.
వరల్డ్ మ్యాప్ ను పోస్టు చేస్తూ.. తన తండ్రి విజయాన్ని కాంక్షించే దేశాలకు రెడ్ కలర్ స్కెచ్ వేశాడు ట్రంప్ తనయుడు. ఇండియా, చైనా, మెక్సికోలు తప్ప మిగతా ప్రపంచం అంతా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నెగ్గాలని కోరుకుంటున్నట్టుగా అతడు చెప్పుకొచ్చాడు!
పాపం మోడీ భక్తులు చేస్తున్న పూజలను ట్రంప్ తనయుడు గుర్తించినట్టుగా లేదు. దాని వల్ల నష్టం లేదు కానీ.. తను పోస్టు చేసిన మ్యాప్ లో ఇండియాలోని చాలా భూభాగాన్ని వేరే దేశాలుగా పోస్టు చేశాడు ట్రంప్.
పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు, కశ్మీర్ ను కూడా పాకిస్తాన్ లో భాగంగా చేశాడు! ఈశాన్యభారతదేశాన్ని కూడా ఇండియా మ్యాప్ లో చూపలేదు. దాన్ని కూడా వేరే దేశంలోకి కలిపేశాడు!
ట్రంప్ తో మోడీ సయోధ్యకు, స్నేహానికి దక్కిన బహుమతి ఇది అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రంప్ తో దోస్తీకి మోడీ అంతగా ముందుకు వెళ్లినా, ఆయన భక్తులు వ్రతాలు, యజ్ఞాలు చేస్తున్నా.. ఇటీవలే ట్రంప్ ఇండియా గురించి మురికి మాటలు మాట్లాడాడు, ఇప్పుడు ఆయన తనయుడు ఇండియాకు నచ్చని రీతిలో ఇండియా మ్యాప్ ను చూపించాడు.
మామూలుగా ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే భక్తులు విరుచుకుపడే వారు, అయితే ఎంతైనా వాళ్ల దగ్గరి బంధువు ట్రంప్ తనయుడు ఇలాంటి ఆకతాయి చేష్టలు చేశాడు కాబట్టి, ఎక్కడివారక్కడే గప్ చుప్!