తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్ నోటికి హద్దు లేకుండా పోయినట్టుగా ఉంది. గత ఏడాది కాలంలో కొంతమందిని దూషించి కేసులను కూడా ఎదుర్కొంటున్న ఆయన మరోసారి రెచ్చిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది వరకూ ప్రభుత్వాధికారులను కూడా తీవ్రంగా దూషించారు కూన రవికుమార్. ఆ కేసుల్లో ఆయన అరెస్టుకు చిక్కకుండా పరారీలో ఉంటూ వచ్చారు. ఒకసారి కాదు.. రెండు మూడు సార్లు ఈ తరహా వార్తల్లో నిలిచారు ఈ తెలుగుదేశం నేత. ఈ పరంపరలో తాజాగా మరోసారి అదే కథ రిపీట్ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ సారి ఆయన తన మాజీ సన్నిహితుడిని దూషించారట. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించడం విషయంలో ఈ వివాదం చోటు చేసుకుందని సమాచారం. గుడ్ల మోహన్ అనే వ్యక్తి కూన రవికుమార్ మీద కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. పొందూరు మండల కేంద్రంలో ఆ వ్యక్తికి సంబంధించిన భవనంలో తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని చాలా కాలం నుంచి నిర్వహిస్తున్నారట, ఆయన కొంత కాలం కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారట. ఈ క్రమంలో తన భవనానికి తెలుగుదేశం రంగులు తీసేయబోగా..ఆ భవనంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కొనసాగించాల్సిందే అంటూ రచ్చ చేశారట కూన రవికుమార్.
తను పార్టీ మారినట్టుగా, తన భవనాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటానంటూ గుడ్ల మోహన్ తేల్చి చెప్పగా, ఫోన్ చేసి ఇష్టానుసారం దూషించారట కూన రవికుమార్. ఇది వరకే ఆయన ఫోన్ రికార్డులు బయటకు వచ్చాయి. అడ్డగోలు వ్యవహారాలను ఆపిన ప్రభుత్వాధికారులకు ఫోన్లు చేసి దూషిచడం, తనను లంచం అడిగారంటూ కేసులు పెడతానంటూ హెచ్చరించడం.. వంటి వ్యవహారాలు వార్తల్లో నిలిచాయి. ఈ క్రమంలో తన మాజీ సన్నిహితుడి మీద కూడా అలానే రెచ్చిపోయారట ఈ తెలుగుదేశం నేత. ఇందుకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయినా కూన రవికుమార్ వరసగా ఇలాంటి వివాదాల్లో నిలుస్తూ ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. నిత్యం ఇలా ఎవరో ఒకరిని దూషిస్తూ వస్తున్నా ఆయన మీద చర్యల్లేవా? అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.