రేపే లాస్ట్ డేట్ …అభ్యర్థి ప్రకటన ఎప్పుడో …? 

హుజూరాబాద్ ఎన్నిక పైన గతంలో ఉన్నంత హడావుడి ఇప్పుడు కాంగ్రెస్ లో లేదు. బీజేపీ, టీఆర్ఎస్ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీకి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర కూడా యాడ్…

హుజూరాబాద్ ఎన్నిక పైన గతంలో ఉన్నంత హడావుడి ఇప్పుడు కాంగ్రెస్ లో లేదు. బీజేపీ, టీఆర్ఎస్ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీకి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర కూడా యాడ్ అయింది. కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు. అంటే ఆ పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు కదా. హుజూరాబాద్ లో పోటీ  చేయాలనుకునేవారు  అందుకు అప్లై చేసుకోవాలని పీసీసీ ప్రకటించింది కదా.

ఇప్పటివరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో తెలియదు. రేపే లాస్ట్ డేట్. ఏమైనా అప్లికేషన్లు వచ్చి ఉంటే వాటిని హై కమాండ్ కు పంపితే వారు వడపోసి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అంటే మరో వారమో, పది రోజులో పడుతుంది.

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల మీద కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.  ఏ క్షణమైనా  ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని, ఈ నెలలోనే అంటే సెప్టెంబర్ లోనో, అక్టోబర్ లోనో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగొచ్చని అనుకుంటున్నారు.

కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని సాధ్యమైనంత తొందరగా ఎంపికచేయాల్సి ఉంటుంది. అప్పుడు నాయకులు, అభ్యర్థి ప్రచారానికి బయలుదేరాల్సి ఉంటుంది. ప్రస్తుతం  గులాబీ పార్టీ నాయకులు ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా ఏదో ఒక రూపంలో ప్రచారం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు పూర్తిగా ఈ పని మీదనే ఉన్నాడు.

ఆయనకు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది. మరోపక్క బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతోంది. ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీ ఇస్తారని భావించిన  మాజీమంత్రి కొండా సురేఖకు ఈ పరిణామాలు ఏ మాత్రం రుచించడం లేదు. కొండా సురేఖను హుజూరాబాద్ రేసులో నిలపడానికి  టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఎంతగానో ప్రయత్నించింది. 

ఆమె ఇక్కడ పోటీ   చేయడానికి  రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఆమెను ఒప్పించింది.  అధిష్టానంతో మాట్లాడి ఆమె పేరును ఖరారు చేసేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే..  కొందరు నేతలు పడనివ్వలేదు. ఈ విషయంలో మాణిక్యం ఠాగూర్ ముందు ప్రస్తావించారు. స్థానికులను కాదని  స్థానికేతరులకు హుజూరాబాద్‌లో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కొర్రీ పెట్టారు.  బీజేపీ, టీఆర్ఎస్‌లకు భిన్నంగా మనం నిర్ణయం తీసుకుంటే నష్టపోతామని అన్నారు. 

ఆ రెండు పార్టీలు  స్థానిక అభ్యర్థినే ఎంపిక చేశాయని చెప్పారు.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలని మాణిక్యం ఠాగూర్ నేతలకు సూచించారు. దీంతో హుజూరాబాద్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుకున్న దానికి పూర్తి భిన్నంగా జరుగుతోంది. మరోవైపు ఎలాగైనా హుజూరాబాద్ బరిలో కొండా సురేఖ ఉండేలా చూడాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఆశలకు గండిపడేలా  ఉంది. 

హుజూరాబాద్‌లో పోటీ చేయలంటే దరఖాస్తు చేసుకోవాలంటూ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రతిపాదనను అంగీకరించబోమని కొండా దంపతులు  చెప్పారు. తమను పోటీ చేయాలని అధిష్టానం కోరితేనే హుజూరాబాద్‌లో పోటీ చేస్తామని.. లేని పక్షంలో పోటీ చేయడానికి తాము అంగీకరించబోమని కొండా దంపతులు స్పష్టం చేశారు.

దీంతో అసలు హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయేది ఎవరనే దానిపై కథ మళ్లీ మొదటికి వచ్చింది.  ఇక ప్రచారం విషయానికొస్తే బీజేపీ తరపున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వస్తాడని అంటున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీని రప్పించాలని రేవంత్ రెడ్డి ప్లాన్. ఏది ఏమైనా ముందు అభ్యర్థి ఎవరో తేలాలి కదా.