దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి. ప్రస్తుతం వైసీపీ నాయకురాలు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు. విద్యావంతురాలు. తనను సాకుగా చూపి, తన భర్త ఎన్టీ ఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడమే కాకుండా ఆయన ప్రాణాలు పోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబే అని ఆమె విశ్వసిస్తు న్నారు. దీంతో ఆమె చంద్రబాబుపై గత 14 ఏళ్లుగా అవిశ్రాంతంగా న్యాయపోరాటం చేస్తున్నారు.
చంద్రబాబును ఎలాగైనా బోనులో ఎక్కించాలని ఆశ పడుతున్నారు. పాపం ఆ తల్లికి తనది అత్యాశే అని అర్థం కానట్టుంది. ఎందుకంటే 14 ఏళ్లుగా తనపై విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారంటే అల్లుడు చంద్రబాబు కెపాసిటీ ఏంటో అత్తగారికి ఈ పాటికే తెలిసి ఉండాలి. చంద్రబాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్, దానిపై స్టే గురించి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నిన్న ఢిల్లీలో ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం.
“చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన పిటిషన్‌పై 14 ఏళ్లుగా స్టే ఉంది. ఇదొక గిన్నీస్ బుక్‌లో చేర్చాల్సిన అంశం. అన్ని సంవత్సరాలు ఏరకంగా స్టే ఇచ్చారన్నది చాలా ప్రధానమైన అంశం”
జీవీఎల్ మాటలు విన్న తర్వాతైనా తన అల్లుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయి వ్యక్తి అని లక్ష్మీపార్వతికి అర్థమై ఉండాలి. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ బాబుపై ఆవేశ పడిపోయారు. దీని వల్ల అనవసరంగా అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడమే తప్ప ఒరిగేదేమీ లేదు. బాబును లక్ష్మిపార్వతి ఏమీ చేసుకోలేరు.
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని నందమూరి లక్ష్మీపార్వతి సవాల్ విసరడం ఆత్మ సంతృప్తి తప్ప…ప్రయోజనం ఉండదు. బాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ట చిత్తశుద్ధి ఉండటం ఏంటి? అసలు అలాంటి వాటితో అల్లుడి గారికి పొసగదనే విషయం తెలియకపోవడమే లక్ష్మి పార్వతి అమాయకత్వానికి నిదర్శనం. చంద్రబాబుకు తెలిసిందల్లా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ తనను కాపాడుకోవడం, ప్రత్యర్థుల్ని ఇరికించడం. తన 72 ఏళ్ల జీవితంలో ఆయన సాధన చేసింది ఇదే. అందువల్లే వాటిలో ఆయన నిష్ణాణుతుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రధాని మోదీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు కూడా లేఖ రాస్తున్నట్టు లక్ష్మిపార్వతి ప్రకటించారు. మన వ్యవస్థలో లేఖలకు న్యాయం జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. అల్లుడికి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని గత 14 ఏళ్లుగా చూస్తున్నప్పటికీ…ఇంకా ఏదో అవుతుందని లక్ష్మిపార్వతి నమ్మడం నిజంగా ఆమెలోని పాజిటివ్‌నెస్‌కు నిలువెత్తు నిదర్శనం. ప్రాణం, ఓపిక ఉన్నంత వరకూ పోరాటం సాగించాలనే ఆమె దృఢ చిత్తాన్ని మాత్రం తప్పక అభినందించాల్సిందే.