హవ్వ.. జల జగడాలతో శ్రీవారి దర్శనాలకు లింకు..?

ఏపీ నుంచి కరోనా రోగులెవరూ మా రాష్ట్రానికి రావొద్దంటూ ఆమధ్య గిరిగీసుకుంది తెలంగాణ. చివరకు హైకోర్టు జోక్యంతో గేట్లు తీసింది. అయితే అందరూ తమలాగే ఉంటారని అనుకుంటున్నారు కొంతమంది తెలంగాణ నాయకులు. ఏపీ నాయకుల్ని…

ఏపీ నుంచి కరోనా రోగులెవరూ మా రాష్ట్రానికి రావొద్దంటూ ఆమధ్య గిరిగీసుకుంది తెలంగాణ. చివరకు హైకోర్టు జోక్యంతో గేట్లు తీసింది. అయితే అందరూ తమలాగే ఉంటారని అనుకుంటున్నారు కొంతమంది తెలంగాణ నాయకులు. ఏపీ నాయకుల్ని నీళ్ల దొంగలంటూ తాము తిట్టడం వల్లే తిరుమలలో తమ సిఫారసు లేఖలు చెల్లుబాటు కావడంలేదంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. 

టీటీడీ వివక్ష చూపిస్తోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. జలజగడాల వల్ల తమకు తిరుమలలో అవమానం జరిగిందని, ఏపీ ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందంటూ వితండవాదానికి దిగారు.

దుష్ప్రచారాన్ని ఖండించిన టీటీడీ…

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల్ని పక్కనపెట్టేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను టీటీడీ అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు.

సిఫారసు లేఖలపై దర్శనం ఆలస్యం అయితే, అప్పటికప్పుడు వారికి 300 రూపాయల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశామని చెప్పారు. గదుల కేటాయింపులో కూడా ఎక్కడా వివక్ష చూపించలేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని కోరారు.

అసలేం జరిగింది..?

వాస్తవానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ఈమధ్య బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే తిరుమల కాస్త రద్దీగా మారుతున్న సమయంలో ప్రజా ప్రతినిధులంతా ఒకేసారి సిఫారసు లేఖలను పంపించారు. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు టైమ్ సర్దుబాటు చేయడం టీటీడీకి తలకు మించిన భారంలా మారింది. 

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకే కాదు, ఏపీ నుంచి వచ్చిన సిఫారసులకు కూడా న్యాయం జరగలేదు. అయితే కేవలం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలే పనిచేయలేదని తప్పుడు ప్రచారం మొదలైంది.

పరిమితికి మించి లేఖలు రావడం వల్లే కొన్నిటిని పక్కనపెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు టీటీడీ అధికారులు. కోటాకు మించి వచ్చిన లేఖలను పక్కనపెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. గతంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు దర్శనాల్లో ఎలాంటి ప్రయారిటీ ఇచ్చేవారమో, ఇప్పుడు కూడా అలాగే స్పందిస్తున్నామని చెప్పారు. అనవసర దుష్ప్రచారం తగదని అన్నారు.