న్యాయ రాజధాని ఏర్పాటులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నూలులో లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం శుక్రవారం రాత్రికే రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడమే ఆలస్యం… శనివారం లోకాయుక్త ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం విశేషం.
మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఇష్టమని, దాంట్లో తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు రెండు రోజుల క్రితం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో కర్నూలులో మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదే పరంపరలో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తర్వాత ప్రారంభం కూడా చకచకా జరిగిపోయాయి. కర్నూలులో స్టేట్‌గెస్ట్ హౌస్‌లోని మూడో సూట్‌లో లోకాయుక్త కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణరెడ్డి, రిజిస్ట్రార్ విజయలక్ష్మి, కలెక్టర్‌తో పాటు మరికొందరు కలసి ప్రారంభించారు.
కర్నూలులో లోకాయుక్త కార్యాలయాన్ని ప్రారంభించడంపై రాయలసీమ సమాజం హర్షిస్తోంది. కర్నూలుకు హైకోర్టు తరలింపులో భాగంగానే వీటి ఏర్పాటు అని న్యాయవాదులు చెబుతున్నారు. ఇది సీమ సమాజానికి ఎంతో శుభసూచికమని వారు అంటున్నారు.