ఇంతకీ నీ ప్రాబ్లమ్ ఏంటి లోకేష్?

అందరూ ఏదో అంటున్నారు కదా అని లోకేష్ కూడా తనూ ఓ రాయి వేద్దామనుకున్నారు ట్విట్టర్ లో, అయితే అది బూమరాంగ్ అయి ఆయన మొహానికే తగిలింది. అసలు లోకేష్ ఇంగ్లిష్ మీడియంను సమర్థిస్తున్నట్టా…

అందరూ ఏదో అంటున్నారు కదా అని లోకేష్ కూడా తనూ ఓ రాయి వేద్దామనుకున్నారు ట్విట్టర్ లో, అయితే అది బూమరాంగ్ అయి ఆయన మొహానికే తగిలింది. అసలు లోకేష్ ఇంగ్లిష్ మీడియంను సమర్థిస్తున్నట్టా లేదా, ఒకవేళ సమర్థిస్తే టీడీపీ హయాంలో చేయలేని పని, వైసీపీ హయాంలో అవుతుంటే మద్దతు తెలపాలి, అభినందించాలి కానీ కుంటి సాకులు వెదకడం ఎందుకని నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు.

ఇంతకీ లోకేష్ ఏమన్నారంటే.. గతంలో తాము నగర పాలక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని భావించినప్పుడు సాక్షి పత్రిక విమర్శిస్తూ వ్యతిరేక వార్తలు రాసిందట. అప్పుడు సాక్షి ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకించింది కదా, ఇప్పుడెలా సమర్థిస్తుంది అనేది లోకేష్ పాయింట్. పాయింట్ బాగానే ఉంది కానీ అసలు సాక్షి పత్రికలో వచ్చే వార్తలకూ, సీఎం జగన్ నిర్ణయాలకూ సంబంధం ఏంటి? పేపర్లో వచ్చే వార్తల్ని, వ్యాఖ్యల్ని, ఎడిటోరియల్ కాలమ్స్ ని జగన్ డిసైడ్ చేయరు కదా.

టీడీపీ అప్పట్లో తలపెట్టిన ప్రయత్నాన్ని సాక్షి తప్పుపట్టిందనే అనుకుందాం. ఇప్పుడు అదే మంచి ప్రయత్నాన్ని సమర్థిస్తోంది కదా. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతున్నట్టే కదా. టీడీపీ అప్పట్లో చేయలేని పనిని ఇప్పుడు వైసీపీ చేసి చూపిస్తుంటే అంత ఓర్వలేని తనం ఎందుకు లోకేష్ అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఆడలేక మద్దెల ఓడంటే ఇదేనేమో.

“అగ్రిగోల్డ్ బాధితులకు మేం చెక్కులు రెడీ చేశాం, మీరొచ్చి వాటిని ఇచ్చేశారు. గ్రామ సచివాలయాలు మేమే పెట్టాం, మీరొచ్చి వాటిల్లో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇంగ్లిష్ మీడియం మేం పెట్టాలనుకున్నాం, మీరొచ్చి పెట్టేశారు” అంటూ మథనపడిపోతున్నారు చినబాబు, పెదబాబు. పేదలకు మంచి జరుగుతుంటే చూస్తూ ఉండలేక, అప్పుడెందుకు అలా చేశారు, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారంటూ ప్రశ్నించడం ఏపాటి మేథావితనమో లోకేష్ కే తెలియాలి.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. చివరికి తెలుగు భాష గురించి లోకేష్ కూడా మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.