''అయ్యా చంద్రబాబుగారు మీ కొడుకు ఏ మీడియంలో చదివాడు? చదవబోమే మీ మనవడు ఏ మీడియంలో చదవబోతున్నాడు? అయ్యా వెంకయ్యనాయుడు గారు మీ కొడుకు, మనవళ్లు ఏ మీడియంలో చదివారు? అయ్యా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారూ మీకు ముగ్గురు భార్యలు. మీకు నలుగురో అయిదుగురు పిల్లలు. మరి వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు? మనం ఇంగ్లిష్ మీడియమ్‌లో చదవకపోవడం వల్ల చాలా నష్టపోయాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము..'' అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ను విమర్శిస్తున్న ప్రముఖులపై ఘాటుగా స్పందించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జాతీయ విద్య, మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న సీఎం ఇలా స్పందించారు.
డబ్బున్న వాళ్లే కాదు, పేద-మధ్యతరగతి వాళ్లు కూడా తమ పిల్లలు మంచి చదువులు చదవాలని, ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని బాగుపడాలని కోరుకునే రోజులివి. చదువు తప్ప తమ జీవితాలను ఏదీ మార్చలేదని సామాన్యులు గ్రహించారు. ఆ మేరకు ఉన్న మేరకు మంచి చదువులను చదివించడానికి కార్పొరేట్ స్కూళ్లలో పిల్లను చేర్చడానికి కూడా వారు వెనుకాడటం లేదు. ఇది అందరికీ తెలిసిన సంగతే.
అయితే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అంటే మాత్రం కొందరు మండిపడిపోతూ ఉన్నారు! దాని వల్ల తెలుగుకు చాలా చేటు అని తేల్చారు. ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని వీరు తప్పపట్టరు. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఆంగ్లమాధ్యమం ఉండకూడదు. ఇదీ నీతిమంతుల నీతి!
ఇక ఇలా నీతులు చెప్పే వాళ్లు సామాన్యులు ఏమీ కాదు. తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివించే వాళ్లే. వీళ్లు ప్రభుత్వ స్కూళ్ల గురించి మాట్లాడటమే కామెడీగా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైమరీ లెవల్ లో ఇంగ్లిష్ మీడియం బోధనను ఆక్షేపిస్తున్న వారి పట్ల సీఎం తీవ్రంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి సీఎం మాటలు వైరల్ గా మారుతున్నాయి.
ఎవరైతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రశ్నిస్తున్నారో, వాళ్ల సంతానం సంగతి చెప్పాలని, ఇంగ్లిష్ మీడియం చదువులను వారి పిల్లలే చదవాలా? సామాన్యులు చదవకూడదా? అని జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇక పవన్ కల్యాణ్ విషయంలో అయితే జగన్ కౌంటర్ మామూలుగా లేదు!