కొడుకుకే కాదు…నాన్న‌కూ సుర‌క్షిత సీటు కావాలి!

కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర వేసింది. దీంతో ఉత్కంఠకు తెర‌ప‌డింది. చంద్ర‌బాబు కంచుకోట‌ను వైసీపీ బ‌ద్ద‌లు కొట్టింది. స‌ర్పంచ్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌తో పాటు తాజాగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ దారుణ ప‌రాజ‌యాన్ని…

కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర వేసింది. దీంతో ఉత్కంఠకు తెర‌ప‌డింది. చంద్ర‌బాబు కంచుకోట‌ను వైసీపీ బ‌ద్ద‌లు కొట్టింది. స‌ర్పంచ్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌తో పాటు తాజాగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ దారుణ ప‌రాజ‌యాన్ని మూట క‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. 

ఇక వైసీపీకి మిగిలింది… చంద్ర‌బాబును కుప్పంలో ఓడించ‌డ‌మే. కుప్పంలో టీడీపీ పునాదులు క‌దిలిపోవ‌డం ఇదే స‌మ‌యంలో అనూహ్యంగా వైసీపీ బ‌ల‌ప‌డ‌డం కొత్త ప‌రిణామంగా చెప్పొచ్చు.

కుప్పం మున్సిపాలిటీలో ఓట‌మితో చంద్ర‌బాబుకు 2024లో ఓట‌మి త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెల్ల‌డవుతున్నాయి. దీంతో ఆయ‌న మ‌రో సుర‌క్షిత నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకోవ‌డం మంచిద‌నే అభిప్రాయాలు టీడీపీ శ్రేణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతుండ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. 

మ‌రోవైపు ఆయ‌న కుమారుడు లోకేశ్‌కు ఇప్ప‌టికీ విజ‌యంపై భ‌రోసా ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గం లేదు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరిలో నిలిచి లోకేశ్ బొక్క బోర్లా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. 2024లో కూడా మ‌రోసారి అక్క‌డే నిలిచి, గెలిచి స‌త్తా చాటుతాన‌ని లోకేశ్ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నారు.

అయితే లోకేశ్ అక్క‌డ గెల‌వ‌డం అంత సుల‌భం కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లోకేశ్‌తోనే స‌మ‌స్య అనుకుంటుంటే, ఇప్పుడు చంద్ర‌బాబు కూడా టీడీపీకి భార‌మ‌య్యారు. లోకేశ్‌కే న‌మ్మ‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దొరక్క టీడీపీ నేత‌లు నానా యాత‌న ప‌డుతుంటే… మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా ఇప్పుడు కుప్పం ఓట‌మి చంద్ర‌బాబుకు కొత్త స‌మ‌స్య తెచ్చి పెట్టింది.  

గెలుపున‌కు తిరుగులేద‌నే నియోజ‌క‌వ‌ర్గం కోసం టీడీపీ అన్వేష‌ణ చేయాల్సి వ‌చ్చింది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం ఎక్క‌డుందో, ఏంటో మ‌రి!