ఏంటిది లోకేష్.. మరీ ఇంత పరువు తక్కువ!

కుప్పంలో వస్తున్న వ్యతిరేక ఫలితాలతో చంద్రబాబు పారిపోతారని, వేరే నియోజకవర్గం వెదుక్కుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపాల్టీ ఎన్నికలు కూడా తేడా కొడితే, బాబు భవిష్యత్ గురించి ఆలోచించాల్సిందేనంటున్నారు. అయితే బాబు ఎక్కడికీ పారిపోరు…

కుప్పంలో వస్తున్న వ్యతిరేక ఫలితాలతో చంద్రబాబు పారిపోతారని, వేరే నియోజకవర్గం వెదుక్కుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపాల్టీ ఎన్నికలు కూడా తేడా కొడితే, బాబు భవిష్యత్ గురించి ఆలోచించాల్సిందేనంటున్నారు. అయితే బాబు ఎక్కడికీ పారిపోరు అంటూ భరోసా ఇస్తున్నారు లోకేష్. 

లోకేష్ కుప్పం పర్యటనలో పలుమార్లు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు వచ్చే దఫా కూడా ఇక్కడినుంచే పోటీ చేస్తారంటూ చెప్పుకోవాల్సిన ఖర్మ పట్టింది లోకేష్ కి. కనీసం చంద్రబాబుని సొంత నియోజకవర్గ ప్రజలు కూడా పట్టించుకోవడంలేదంటే ఎంత పరువు తక్కువ. పైగా ఆ విషయాన్ని పదేపదే గుర్తుచేస్తున్నట్టున్నాయి లోకేష్ వ్యాఖ్యలు.

చంద్రగిరి నియోజకవర్గంతో తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిన బాబు.. ఒక్కసారి అక్కడి ప్రజలు ఓడించే సరికి కుప్పం సర్దుకున్నారు. వరుసగా కుప్పంలో గెలుస్తూ వస్తున్నా.. గత రెండు దఫాలుగా ఆయన మెజార్టీ పడిపోతోంది. కనీసం నామినేషన్ కి కూడా చంద్రబాబు కుప్పం వైపు చూడరు, గెలిచాక ఎలాగూ చూడరనుకోండి. పండగలకి, పబ్బాలకి కుటుంబంతో కలసి నారావారి పల్లెకు వస్తారు కానీ.. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి మాత్రం అంతంతమాత్రమే. కానీ కలిసొస్తుంది కదా అని కుప్పంను అలాగే నిలబెట్టుకున్నారు బాబు.

ఈసారి ఎన్నడూ లేనంతగా తన నియోజకవర్గంలోనే టీడీపీ పరువుపోయింది. ఏకంగా కుప్పం ఎంపీటీసీ సీటు ఎగిరిపోయింది, ఇతర ఎన్నికల్లో కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. దీంతో ఎలాగైనా మున్సిపాల్టీ ఎన్నికల్లో నెగ్గి తన పట్టు నిలుపుకోవాలనేది చంద్రబాబు ఆలోచన. కానీ వైసీపీ నేరుగా కుప్పంని టార్గెట్ చేసుకుంది. చంద్రబాబుని మానసికంగా మరింత దెబ్బకొట్టాలంటే కుప్పం కంచుకోట బద్దలు కొట్టాల్సిందేనని డిసైడ్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి.

దీంతో బాబులో భయం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా రాని చంద్రబాబు.. తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చారు, తాను రావడంతో పాటు ఐదుగురు మాజీ మంత్రుల్ని అక్కడ మోహరించారు. స్వయానా కొడుకు లోకేష్ ని కూడా పంపించారు. కానీ జనం నమ్మడం లేదు. 2024లో కుప్పం నుంచి చంద్రబాబు జెండా ఎత్తేస్తారని, ఆ మాత్రానికి టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. దీంతో టీడీపీ కవర్ చేసుకోలేక చస్తోంది.

కుప్పంలో 2024లో కూడా చంద్రబాబే పోటీ చేస్తారని, అనుమానాలు పెట్టుకోవద్దని ఓటర్లకు సర్ది చెబుతున్నారు లోకేష్. అసలు బాబు నియోజకవర్గం మారుస్తారనే ఆలోచన ఎందుకొచ్చింది, దాన్ని కవర్ చేసుకోడానికి ఈ తంటాలన్నీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పంని పట్టించుకుని ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అని అడుగుతున్నారు.

మరోవైపు సరిగ్గా ఇదే టైమ్ లో కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ భరత్ కు ఎమ్మెల్సీ సీటు ఖరారు చేశారు జగన్. ఈ వ్యవహారం కూడా స్థానికంగా చర్చనీయాంశమైంది. కుప్పంలో వైసీపీ నేతలకు పార్టీ సముచిత స్థానం ఇస్తుందనే సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే 2024లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే తెలుస్తోంది. అందుకే “నేను పోటీలో ఉన్నా, నేనే పోటీలో ఉన్నా”నంటూ చంద్రబాబు చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురించింది.