దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అంటే.. అదో సమాధానం లేని ప్రశ్నే అవుతోంది. అధినాయకత్వమే అసలు సమస్యగా మారింది ఆ పార్టీకి. పార్టీకి పెద్ద భారంగా మారింది అధినాయకత్వమే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను అక్కడక్కడ ప్రజలే కాపాడే అవకాశాలున్నాయని ఎన్నికల సర్వేలు అంచనా వేస్తూ ఉన్నాయి.
ఏ ఒక్క రాష్ట్రంలోనూ పార్టీని సరిగా డీల్ చేయడం సోనియాగాంధీకి కానీ, రాహుల్ కు కానీ, ప్రియాంకకు కానీ సాధ్యం కావడం లేదు. నిన్న మొన్నటి వరకూ తిరుగులేదనుకున్న పంజాబ్ లో కూడా పార్టీని పాతరేసేంత వరకూ వచ్చారు. అధికారంలో ఉన్న చోటే అలాంటి పరిస్థితి ఉంటే, మిగిలిన చోట్ల బీజేపీతో పోరాడటం కానీ, ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగడంలో కానీ కాంగ్రెస్ పార్టీ అస్సలు పోరాటపటిమను చూపలేకపోతోంది.
నాయకత్వ స్థాయిలో దేశ వ్యాప్తంగా చిన్నపాటి ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ లీడ్ చేయలేకపోవడం ప్రతిపక్షంగా పార్టీకి తిరుగులేని ఫెయిల్యూర్. ఆ సంగతంతా అలా ఉన్నా.. ఇంకా కొన్ని చోట్ల బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నిలవగలుగుతోందని తాజా అధ్యయనమొకటి చెబుతోంది.
త్వరలోనే ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో ఉండబోతోందని ఈ అధ్యయనం అంటోంది. ప్రత్యేకించి ఉత్తరాఖండ్ లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని ఏబీపీ, సీఓటర్, ఐఏఎన్ఎస్ ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది.
70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కనీసం 32 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. బీజేపీ 38 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిస్తే, 32 సీట్లతో కాంగ్రెస్ కు ప్రజలు ద్వితీయ స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా. మరి కాంగ్రెస్ అన్ని సీట్లను గెలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేలను బీజేపీ ఎలాగూ తనవైపుకు తిప్పుకోవచ్చు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఏ స్థాయిలో సత్కరిస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే.. ప్రజలైతే కాంగ్రెస్ ను పూర్తిగా చంపేయడం లేదని ఈ సర్వే అంచనా. అయితే ఇది ప్రీ పోల్ సర్వేనే. అసలు ఫలితాలు కాస్త అటూ ఇటూగా ఉండవచ్చు!
ఇక పంజాబ్ విషయానికి వస్తే.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్ పార్టీ పరువు పాతాళానికి చేరినా.. అక్కడ గట్టి పోటీని అయితే కాంగ్రెస్ ఇవ్వగలదట. వచ్చేసారి పంజాబ్ లో ఆప్ మెరుగైన సీట్లను సాధించవచ్చని ఈ సర్వే అంచనా వేస్తోంది. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 51 సీట్లతో పెద్ద పార్టీగా నిలవొచ్చని, అదే కాంగ్రెస్ పార్టీ 46 సీట్లతో ఉనికి చాటుకోవచ్చని అంచనా. క్రితం సారి ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ కు 77 సీట్లు దక్కాయి. ఇప్పుడు అవి 46కు పడిపోనున్నాయని అంచనా. ఇక శిరోమణి అకాళీదల్ అక్కడ 20 సీట్లను పొందవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.
ఇక మణిపూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. 60 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీకి 27, కాంగ్రెస్ కు 22 సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని ఈ ప్రీపోల్ సర్వే అంచనా వేస్తోంది. యూపీలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి ఏమంత మెరుగవ్వకపోవచ్చని అంచనా.
ఏతావాతా ప్రీ పోల్ సర్వేలను బట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధినాయకత్వం ఎంతలా దెబ్బ కొడుతున్నా, ప్రజలైతే దానికి అప్పుడప్పుడు అయినా ఆక్సిజన్ ఇస్తారని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా కష్టపడితే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కనీస పోటీ ఇచ్చే పరిస్థితుల్లో అయితే ఉంది.