వచ్చే ఏడాది జరగనున్న యూపీ ఎన్నికల ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. యూపీలో బీజేపీకి ఎలాంటి అనుభవం ఎదురవుతుందనేది.. ఆ పార్టీ రాజకీయ భవితవ్యానికి కూడా పెద్ద పరీక్షగా నిలవడం ఖాయం. యూపీలో ఇది వరకూ సంచలన స్థాయి విజయాలను నమోదు చేసిన బీజేపీ.. ఇప్పుడు అక్కడ బంపర్ మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో కాషాయ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో.. అక్కడ బీజేపీకి ఎదురయ్యే ఫలితం ఎలాంటిదనేది సర్వత్రా ఆసక్తిదాయకమైన అంశం.
ఈ విషయంపై పేరున్న మీడియా సంస్థలు ఒక సర్వేను చేసి, ఫలితాలను వెల్లడించాయి. ఏబీపీ, సీఓటర్, ఐఏఎన్ఎస్ .. సంస్థలు ఉమ్మడిగా నిర్మించిన అధ్యయనంలో యూపీ ఫలితాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఈ అధ్యయనం ముందుగా చెబుతున్నది ఏమిటంటే..యూపీలో మరోసారి బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే.. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీజేపీ బలం చాలా వరకూ తగ్గిపోతుందని ఈ అధ్యయనం అంటోంది.
క్రితం సారి కమలం పార్టీ, దాని మిత్రపక్షాలకు యూపీలో వచ్చిన సీట్ల సంఖ్య 325. 403 అసెంబ్లీ స్థానాలున్నా యూపీలో ఆ స్థాయిలో బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సారి కమలం పార్టీ ఏకంగా 108 సీట్లను కోల్పోనుందని ఈ ప్రీపోల్ సర్వే అంచనా వేసింది. బీజేపీకి 217 అసెంబ్లీ సీట్లు దక్కవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. క్రితం సారి మూడో వంతుకు మించి సీట్లను నెగ్గిన బీజేపీ ఈ సారి మినిమం మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది.
ఇక బీజేపీ కోల్పోయే సీట్లలో మెజారిటీ సీట్లను సమాజ్ వాదీ పార్టీనే సొంతం చేసుకుంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. గత పర్యాయం అఖిలేష్ నాయకత్వంలో, కాంగ్రెస్ తో పొత్తుతో ఎస్పీ ఎన్నికలకు వెళ్లింది. అప్పుడు సాధించిన సీట్లు కేవలం 60 సీట్లకు ఎస్పీ పరిమితం కాగా.. ఈ సారి ఆ పార్టీకి 156 అసెంబ్లీ సీట్ల వరకూ లభించవచ్చని అంచనా. తద్వారా యూపీలో బలమైన ప్రతిపక్షంగా ఎస్పీ నిలుస్తుందని ఈ అధ్యయనం అంచనా వేస్తోంది.
ఇలా యూపీలో బీజేపీ నెగ్గినా.. గతంలో ఉన్నంత ఊపు ఉండదని ఈ ప్రీపోల్ సర్వే అంచనా వేస్తోంది. అయితే ఇవి ప్రీ పోల్ సర్వేలే. ఇది వరకూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ప్రీ పోల్ సర్వేలు చాలా వరకూ నిజం కాలేదు. అప్పుడు బిహార్ లో బీజేపీ-జేడీయూ లు క్లీన్ స్వీప్ చేస్తాయని ప్రముఖ మీడియా సంస్థలు అంచనా వేశాయి. అయితే ఫలితాల్లో.. ఆర్జేడీ చాలా వరకూ పోరాడింది. యూపీ విషయంలో మాత్రం అధికార పార్టీ ఊపు మరీ గొప్పగా ఏమీ ఉండదని అంటున్నాయి. మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందో!