అంతా క‌లిసి.. లోకేష్ ను తెర‌మ‌రుగు చేసేస్తున్నారు!

రోజు రోజుకూ తెలుగుదేశం పార్టీ వార్త‌ల్లో నారా లోకేష్ పేరు వినిపించ‌డం త‌గ్గిపోతోంది. ఒక ద‌శ‌లో అంతా తానే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడికి ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేత ట్యాగ్ కూడా…

రోజు రోజుకూ తెలుగుదేశం పార్టీ వార్త‌ల్లో నారా లోకేష్ పేరు వినిపించ‌డం త‌గ్గిపోతోంది. ఒక ద‌శ‌లో అంతా తానే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడికి ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేత ట్యాగ్ కూడా పోతోంది. అధికారికంగా టీడీపీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వంటి హోదాను క‌లిగి ఉన్నా, లోకేష్ కేరాఫ్ మంగ‌ళ‌గిరిగా మాత్ర‌మే మిగిలారిప్పుడు.

లోకేష్ జిల్లాలు దాట‌డం కూడా ఇప్పుడు క‌ష్టంగా మారిన‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. టీడీపీ నేత‌లు ఎక్క‌డైనా అరెస్టులు అయితే.. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కూ వెళ్లి వారికి భ‌రోసాలు ఇచ్చే వారు లోకేష్. ఆ మ‌ధ్య తాడిప‌త్రికి వెళ్లి భారీ మెనూతో భోజ‌నం టేబుల్ ముందు క‌నిపించి లోకేష్ వార్త‌ల్లో నిలిచారు. 

ఇక ఈ మ‌ధ్య‌కాలంలో లోకేష్ రాష్ట్ర స్థాయి నేత‌గా, టీడీపీ ముఖ్య నేత‌గా వెళ్లింది కుప్పం ప‌ర్య‌ట‌న‌కు మాత్ర‌మే. అయితే  ఆ ప్ర‌య‌త్నం కూడా ఎగ‌ద‌న్నింది. లోకేష్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత కుప్పం మున్సిపాలిటీని టీడీపీ కోల్పోయింది.

ఇక ఇదే స‌మ‌యంలో లోకేష్ , చంద్ర‌బాబుల మ‌ధ్య ఒక విష‌యంలో బేధాభిప్రాయాలు పొడ‌సూపుతున్నాయ‌నే వార్త‌లూ వ‌చ్చాయి. ఎలాగైనా మ‌ళ్లీ వాళ్ల‌తో వీళ్ల‌తో పొత్తులు పెట్టుకుని.. తిరిగి అధికారానికి చేరువ కావాల‌ని చంద్ర‌బాబు నాయుడు బాహాటంగానే ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. జ‌న‌సేన‌పై త‌న‌ది వ‌న్ సైడ్ ల‌వ్ అని స్వ‌యంగా చంద్ర‌బాబే చెప్పుకున్నారు. 

అయితే లోకేష్ కు ఈ పొత్తుల‌పై అనాస‌క్తి ఉంద‌ని, వ‌చ్చే సారి గెలిచినా ఓడినా సోలోగా వెళ్లి తేల్చుకోవాల‌ని, ఆ త‌ర్వాత ఐదేళ్ల‌కు అయినా అధికారం ద‌క్కుతుంద‌ని లోకేష్ భావిస్తున్నాడ‌నే గాసిప్ లు వినిపించాయి. అయితే లోకేష్ మాట‌ను చంద్ర‌బాబు ప‌ట్టింకోవ‌డం లేద‌ని ఆయ‌న పొత్తుల పాకులాట‌లు చూస్తే స్ప‌ష్టం అవుతోంది.

స‌రిగ్గా ఆ స‌మ‌యం నుంచినే.. లోకేష్ తెర‌మ‌రుగు కావ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర స్థాయి నేత‌, టీడీపీ భావి ఆశాకిర‌ణం అనే ట్యాగులు క్ర‌మంగా క‌నుమ‌రుగ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ నెగ్గితే త‌నే సీఎం అంటూ చంద్ర‌బాబు నాయుడు ప‌దే ప‌దే ప్ర‌క‌టించుకుంటున్నారు. ఇక తెలుగుదేశం తోక ప‌త్రిక కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిస్తే లోకేష్ సీఎం అవుతాడంటూ పీకే టీమ్ ప్ర‌చారం చేస్తోందంటూ.. లోకేష్ ను ఊక‌లో ఈక‌లా తీసేసింది.లోకేష్ సీఎం అవుతాడంటే ప్ర‌జ‌లు టీడీపీకి ఓటేయ‌ర‌న్న‌ట్టుగా స్వ‌యంగా టీడీపీ భ‌జ‌న వ‌ర్గాలే ఇలా ప్ర‌క‌టించుకున్నాయి. 

ఇలా అయిన వాళ్లే లోకేష్ గాలి తీసేశారు. ఇప్పుడు తండ్రే లోకేష్ ను తెర‌మ‌రుగు చేస్తున్నాడు. వ‌య‌సు మీద ప‌డుతున్నా..  ఓపిక త‌గ్గిపోయినా.. చివ‌ర‌కు త‌నేం మాట్లాడుతున్న‌ట్టో త‌న‌కే అర్థం కాని ప‌రిస్థితుల్లో క‌నిపిస్తున్నా చంద్ర‌బాబు నాయుడు త‌న త‌న‌యుడికి కూడా అవ‌కాశం ఇవ్వ‌కుండా అంతా తానే అవుతుండ‌టం గ‌మ‌నార్హం.