టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కొహ్లీ తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ ఎవరనేది ఆసక్తిదాయకమైన అంశంగా మారింది. ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్ లో కొహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. రోహిత్ కెప్టెన్సీలో ఇది వరకే పరిమిత ఓవర్ల మ్యాచ్ లను ఆడింది. పూర్తి స్థాయిలో శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు.
వన్డేలు, టీ20ల విషయంలో రోహిత్ శర్మ తిరుగులేని ప్లేయర్ అనేది అంతా ఒప్పుకునేదే. ఈ ఫార్మాట్ లలో అనితర సాధ్యమైన రికార్డులే రోహిత్ శర్మ పేరు మీద ఉన్నాయి. రోహిత్ ను పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు కెప్టెన్ గా చేయాలని చాలా మంది మాజీలు కూడా ముందు నుంచినే డిమాండ్ చేశారు. అది జరిగింది.
ఇక టెస్టుల్లో కూడా రోహిత్ తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఒక దశలో టెస్టులకు పనికిరాడనే ముద్ర నుంచి రోహిత్ .. చాలా మెరుగయ్యాడు. ఇటీవలే టెస్టులకు వైస్ కెప్టెన్ గా కూడా రోహిత్ నియమితం అయ్యాడు. కానీ టెస్టుల విషయంలో రోహిత్ పై ఇంకా ఎక్కడో అపనమ్మకం ఉంది. ఇక ఫిట్ నెస్ విషయంలో కూడా రోహిత్ పై విమర్శలు లేకపోలేదు!
ఈ నేపథ్యంలో టెస్టు జట్టుకు ఫ్రెష్ కెప్టెన్ ను ఎంపిక చేస్తే అది ఆసక్తిదాయకమైన పరిణామం అవుతుంది. అదే జరిగితే రిషబ్ పంత్ బెస్ట్ ఛాయిస్ అవుతాడనే విశ్లేషణ ఉంది. దీన్ని హైలెట్ చేస్తోంది ఎవరో కాదు.. విఖ్యాత క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్. 24 యేళ్ల పంత్ ను టెస్టు జట్టుకు కెప్టెన్ గా చేయాలని , అది మంచి ఎంపిక అవుతుందని గావస్కర్ అభిప్రాయపడుతున్నారు.
ఇదే జరిగితే.. అత్యంత పిన్న వయసులో టీమిండియా టెస్టు కెప్టెన్ గా ఎంపికైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడు. ఇప్పటి వరకూ టైగర్ పటౌడీ పేరు మీద ఈ రికార్డు ఉంది. వెనుకటికి .. దక్షిణాఫ్రికా జట్టు పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలను స్మిత్ కు అప్పగించారు ఇలాగే. 2003 ప్రపంచకప్ లో ఫెయిల్యూర్ పై బాధ్యతగా పొలాక్ తప్పుకోగా, జట్టులో గిబ్స్, డీపెనర్ వంటి సీనియర్లున్నా… స్మిత్ కు కెప్టెన్సీని ఇచ్చారు.
చిన్న వయసులోనే కెప్టెన్ అయిన స్మిత్ ఆ తర్వాత తన కెరీర్ ఆసాంతం సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్ గా కొనసాగాడు. అన్ని జట్ల పరంగా చూసుకున్నా.. విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. స్మిత్ విషయంలో సౌతాఫ్రికా బోర్డు చేసిన సాహసం మంచి ఫలితాలను ఇచ్చింది. మరి బీసీసీఐ అంతటి డేరింగ్ డెషిషన్ ను తీసుకుని పంత్ ను కెప్టెన్ గా చేయగలదా?