భారత క్రికెట్ జట్టులో అత్యంత శక్తిమంతమైన క్రీడాకారుడెవరంటే…విరాట్ కోహ్లీ పేరే వినిపిస్తుంది. క్రీడా మైదానంలోనూ, వెలుపల కూడా విరాట్ కోహ్లీ తన ఉద్వేగాల్ని ఏ మాత్రం దాచుకోలేరు. బంతితోనే కాదు, భావాలతోనూ అతను గేమ్ ఆడుతుంటారు. తానొక నిర్ణయానికి వస్తే… ఇక రెండో మాటకే అవకాశం లేకుండా గట్టిగా నిలబడతారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో పలు చారిత్రక విజయాలను అందుకోడానికి ప్రధాన కారణం…ఆయన ఆట తీరు, నాయకత్వ లక్షణాలతో పాటు దూకుడైన ఆయన వ్యక్తిత్వం కూడా కారణమని చెప్పేవాళ్లు లేకపోలేదు.
68 టెస్టులకు నాయకత్వం వహించిన కోహ్లీ…అందులో 40 మ్యాచ్‌ల్లో గెలుపొందారంటే ఆయన ప్రతిభను అంచనా వేసుకోవచ్చు. అయితే దక్షిణాప్రికాలో టెస్ట్ సిరీస్‌ను విజయంతో ముగించాలనే ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. సిరీస్‌ను చేజార్చుకుని కాసింత నిరాశతోనే టెస్ట్ మ్యాచ్‌ల నాయకత్వం నుంచి కోహ్లీ తప్పు కోవాల్సి వచ్చింది.
ఇప్పటికే ఆయన టీ20 సారథిగా తనకు తాను తప్పుకుంటే, వన్డే సిరీస్ నాయకత్వం బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్ సారథిగా తప్పుకుంటున్నట్టు కోహ్లీ అనూహ్యంగా శనివారం ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఈ విషయంపై పరిమిత ఓవర్ల (టీ20) కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. కోహ్లి నిర్ణయం తనను విస్మయానికి గురి చేసిందనడం గమనార్హం. ఇంకా ఆయన ఏమన్నారంటే…
‘షాక్ అయ్యాను! భారత జట్టు కెప్టెన్‌గా విజయవంతమైన నీకు శుభాకాంక్షలు కోహ్లీ.. నీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కోహ్లీ ఆటైనా, నిర్ణయాలైనా సంచలనం కలిగిస్తాయి. ఇందుకు నిదర్శనమే టెస్ట్ క్రికెట్ సారథి బాధ్యతల నుంచి తప్పుకోవడం.