సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణకు తన పార్టీని ఏం చేయాలని భావిస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రజాసమస్యలపై పోరాటాలు, మాటల తూటాలు పేల్చాల్సిన కమ్యూనిస్టు అగ్రనాయకుడు నారాయణ… లక్ష్యాన్ని మరిచి చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కావడాన్ని రాజకీయం చేయాలనే ఎల్లో బ్యాచ్ ప్రయత్నాలకు ఆయన ఊపిరి పోస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య లంచ్ భేటీలో ఏం జరిగిందో తేలాల్సిందే అని స్పష్టం చేయడం గమనార్హం. కనుమ రోజు కఠోర వాస్తవాలు మాట్లాడాల్సి వస్తోందని ఆయన అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. చిరంజీవికి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేశారనే కట్టుకథను ఎల్లో మీడియా అల్లిన సంగతి తెలిసిందే. ఈ దుష్ప్రచారాన్ని చిరంజీవి ఇప్పటికే ఖండించారు. తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు, ఆకాంక్షలు లేవని, ఇకపై అలాంటి కథనాలు ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ఒకమారు నారాయణ ఈ విషయమై మాట్లాడి నెటిజన్లతో చీవాట్లు తిన్నారు. అయినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. మరోసారి జగన్, చిరు ఎపిసోడ్‌పై నారాయణ స్పందించడం ఆయన రాజకీయ దురుద్దేశాలను తెలియజేస్తోంది. ‘చిరంజీవిని తాము పిలవలేదని.. ఆయనే వచ్చారని ప్రభుత్వం చెప్తోంది. సీఎం పిలిస్తేనే వెళ్ళానని చిరంజీవి అంటున్నారు. ఏది నిజమో ప్రజలకు తెలియాలి. పబ్లిక్ ఇష్యూని వ్యక్తిగతంగా మాట్లాడటం సరైంది కాదు ’ అని నారాయణ పేర్కొన్నారు.
ఇంతకూ చంద్రబాబుతో తమ సంబంధాలు ఏంటో జనానికి ముందుగా సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణ తెలియజేస్తే మంచిదని సొంత పార్టీ వాళ్లే చాలా కాలంగా కోరుతున్నారు. ఒకవైపు తాము బద్దశత్రువుగా భావించే బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ కోసం సీపీఐ నాయకులు సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోఫణలున్నాయి.
ఇటీవల తిరుపతిలో అమరావతి సభలో బీజేపీ పాల్గొంటున్న కారణంగా సీపీఎం బహిష్కరించింది. ఇదే సీపీఐ మాత్రం… చంద్రబాబు కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి బీజేపీతో చేయి కలపడం తెలిసిందే. తాజాగా చిరంజీవి ఎపిసోడ్‌లో కూడా టీడీపీ తన బాధనంతా నారాయణ నోటి వెంట వ్యక్తం చేస్తోందనే వాళ్లు లేకపోలేదు.