ఆ జిల్లా బాగా వెనకబడింది. అంతే కాదు, ఉత్తరాంధ్రాలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లా కూడా. అభివృద్ధికి పెద్దగా నోచుకోని ఆ జిల్లాకు వైసీపీ ప్రభుత్వం పెద్ద వరాన్నే ఇచ్చేసింది. విజయనగరంలోని జేఎన్ టీయూ ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి స్థాయి యూనివర్శిటీగా హోదా కల్పిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తరాంధ్రా ప్రజలకు పూర్తి స్థాయిలో సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళూ కాకినాడలోని జే ఎన్ టీయూకి అనుబంధంగా సాగిన ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఇపుడు విశ్వవిద్యాలయం కావడం, అందునా విజయనగరం లాంటి ప్రాంతంలో ఉండడంతో మూడు జిల్లాల ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక తాజాగా దీని పేరుని కూడా స్థానిక మహాకవికి గుర్తుగా జే ఎన్ టీయూ గురజాడ విజయనగరం యూనివర్శిటీగా పేర్కొంటున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రాకు గట్టి మేలు తలపెట్టే పనిని వైసీపీ ప్రభుత్వం చేసింది అంటున్నారు.
ఇక తొందరలోనో ఇదే జిల్లాలో గిరిజన వర్శిటీ కూడా ఏర్పాటు అవుతుంది అంటున్నారు. మొత్తానికి విద్యల నగరానికి గత వైభవం బాగానే సంతరించుకుంటోంది అని చెప్పవచ్చు.