తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పండుగ ఇది. పట్టణాలు, నగరాలు అన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి పల్లెల మీద పడతాయి. వారూ వీరూ అన్న తేడా లేకుండా అంతా ఎంజాయ్ చేసే వేడుక ఇది. సంక్రాంతి పండుగ కోసం పది రోజుల ముందు నుంచి సందడి మొదలై అతి పెద్ద కోలాహలంగా సాగింది. ఎటు చూసినా జనసమూహంతో లోగిళ్ళు, వాకిళ్ళు నిండిపోయాయి. ఇక పండుగ కంటే ముందే కరోనా మూడవ దశ వీర విహారం మొదలైంది. అది పీక్స్ కి చేరుకుంటోందిపుడు.
ఏపీలో వేలల్లో కేసులు వస్తూంటే విశాఖలో కూడా ఆ నంబర్ పదిహేను వందల పై దాటుతోంది. దీంతో జిల్లా అధికారులు పూర్తి అలెర్ట్ అవుతున్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్ ని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. గత అనుభవాలు, రెండవ వేవ్ లో చోటు చేసుకున్న చేదు ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా వైద్యపరమైన కొరత రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ సిటీలో ఇపుడు కోవిడ్ కేసు సెంటర్లలో పడకలను అయిదు వేలకు పెంచారు.
అదే విధంగా రూరల్ జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల పడకలకు తక్కువ కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా కూడా చూస్తున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో కొద్ది పాటి లక్షణాలు ఉన్న వారికి వైద్యం ఇస్తారు. అలాగే కోవిడ్ కేర్ సెంటర్లలో భోజన సేవలను అందిస్తారు.
ఇక తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తే వారిని కోవిడ్ ఆసుపత్రులకు తక్షణం తరలించేలా కూడా ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. అంబులెన్సులను సైతం అందుబాటులో ఉంచారు. మొత్తానికి పండుగ తరువాత విశాఖ లాంటి చోట్ల కచ్చితంగా వేల కేసులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే పండుగ ముగిసింది. ఇక కోవిడ్ తో యుద్ధం స్టార్ట్ అయింది అనుకోవాలన్న మాట.