చిరు ఎపిసోడ్-దోషులెవరు?

ఎదుటి వాడి మీద బురద వేసేయడం…వాళ్లనే కడుక్కోమనడం ఎల్లో మీడియాకు అచ్చమైన అలవాటు. మెగాస్టార్ చిరంజీవి బయల్దేరి సిఎమ్ జగన్ దగ్గరకు వెళ్లగానే ఎల్లో మీడియా రకరకాల కథనాలు వండి వార్చడం మొదలు పెట్టింది. …

ఎదుటి వాడి మీద బురద వేసేయడం…వాళ్లనే కడుక్కోమనడం ఎల్లో మీడియాకు అచ్చమైన అలవాటు. మెగాస్టార్ చిరంజీవి బయల్దేరి సిఎమ్ జగన్ దగ్గరకు వెళ్లగానే ఎల్లో మీడియా రకరకాల కథనాలు వండి వార్చడం మొదలు పెట్టింది. 

నిరంజన్ రెడ్డి సాయం తో అని ఓసారి, పికె వ్యూహం అంటూ మరోసారి. రాజ్యసభ అంటూ ఇంకోసారి. ఇవి ఇలా సాగుతూనే వుంటాయనే మెగాస్టార్, కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసారు. తనకు మరోసారి రాజకీయాల్లోకి రావడం ఆసక్తి లేదు అని.

అప్పుడు ఇదంతా ఎవరు చేసారబ్బా? అంటూ అమాయకంగా మళ్లీ కథనాలు. వైకాపా శ్రేణులే ఈ గ్యాసిప్ లు వదిలాయంటూ కథనాలు. ఇవన్నీ చాలక, చిరు ఇంత చెప్పాక కూడా, భీమవరం నుంచి రఘురామరాజు మీద పోటీ చేయమంటూ చిరుకు జగన్ ఆఫర్ ఇచ్చారంటూ మరో కథనం. 

అస్సలు అర్థం వుందా? ఈ కథనం వండి వార్చడానికి?  రఘురామకృష్ణం రాజు రాజీనామా అన్నదే అనుమానం. పైగా చిరంజీవి లాంటి వాళ్లకు ఆఫర్ ఇస్తే నో అనడానికి వీలు లేని ఆఫర్ ఇస్తారు కానీ ఇలాంటి రిస్కీ ఆఫర్లు ఇస్తారా? ఇస్తే తీసుకుంటారా?

మెదడు మోకాలులో పెట్టుకుని చేసే ఆలోచనలు అనాలేమో వీటిని?  లేదా చిరంజీవి నేరుగా జగన్ ను కలవడం ఇష్టం లేక చేస్తున్న అతితెలివి ఆలోచనలో? ఒక పక్క ఎంత చేయాలో అంతా చేస్తూ, ఇదంతా ఎవరో చేస్తున్నారంటూ వార్తలు వండి వార్చడం కూడా ఈ 'సామాజిక మీడియా' కే సాధ్యం.