కోవిడ్ మహమ్మారి మొట్టమొదటగా విద్యా వ్యవస్థపై పంజా విసురుతోంది. ఆ తర్వాత ఎక్కువ హాని కలిగించేదే వ్యాపార వ్యవ స్థలపైనే. తాజాగా తెలంగాణలో కోవిడ్ విజృంభణను పరిగణలోకి తీసుకుని వైద్యారోగ్యశాఖ విద్యాశాఖకు కీలక సిఫార్సు చేసింది. దీంతో సంక్రాంతి సెలవులను నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తున్నట్టు కనిపిస్తోంది.
విద్యా వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడం వల్లే వెంటనే వాటిని బంద్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికే కరోనా వల్ల చదువులు నాశనమయ్యాయని, దీనికి తోడు ప్రభుత్వ నిర్ణయాలు విద్యా వ్యవస్థను మరింత దిగజారుస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చిన్న క్లాస్‌లు మొదలుకుని ఉన్నత చదువుల వరకూ అన్ని విద్యా కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు పొడిగించడంపై తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
బడుల మూసివేత వెనుక కుట్ర ఉందని ట్రెస్మ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి ఆరోపించడం గమనార్హం. బడుల్లో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అయినప్పటికీ కరోనా సాకు చూపి బడులు బంద్ పెట్టడం కనిపించని కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. మాస్క్‌లు, శానిటైజేషన్, భౌతికదూరం పాటించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మరోవైపు బార్లు, వైన్స్, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ తెరిచి స్కూళ్లు బంద్ పెట్టడం అన్యాయమని శ్రీనివాసరెడ్డి మండి పడ్డారు. కరోనాతో విద్యా వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యిందన్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న విద్యారంగంపై బడుల మూసివేత పెద్ద షాక్ అని అంటున్నారు. కేవలం ప్రభుత్వానికి ఆదాయం లేదని స్కూళ్ల మీదే ముందుగా పడుతు న్నారని ఆరోపించారు.
ఆన్‌లైన్‌తో విద్యార్థులకు లాభం లేదని ఆయన పేర్కొన్నారు. బార్లు, వైన్స్, సినిమా థియేటర్లపై ఇదే రకమైన ప్రశ్నలు మిగిలిన వర్గాల నుంచి కూడా వస్తున్నాయి. వాటిని మూసేస్తే ప్రభుత్వం నడవదనే ఉద్దేశంతో… కరోనా ఎంత తీవ్రంగా ఉన్నా వాటి జోలికి ప్రభుత్వాలు వెళ్లడం లేదు. ఆదాయంపై తప్ప మనుషుల ప్రాణాలపై ప్రేమ లేదనే చర్చకు పాలకుల చర్యలు కారణమవుతున్నాయి.