వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముచ్చటగా మూడోసారి కోవిడ్ బారిన పడ్డారు. గతంలో కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లలో కూడా ఆయన ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ నెమ్మదిగా తన ప్రతాపాన్ని చూపుతూ వస్తోంది. ఈ సందర్భంగా పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మహమ్మారి బారిన పడ్డారనే వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే మంత్రులు కొడాలి నాని, కృష్ణదాస్, వెల్లంపల్లి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రనాథరెడ్డి తదితరులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా లక్షణాల తీవ్రతను బట్టి ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. లేదంటే ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో తాను కరోనా బారిన పడినట్టు అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇవాళ జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటే…వైద్యపరీక్షలు చేయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందన్నారు. ట్రీట్మెంట్కు వెళుతున్నట్టు అంబటి తెలిపారు.
మూడోసారి ఆయన కరోనాబారిన పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకసారి కరోనాకు గురైతే రోగ నిరోధక లక్షణాలు వృద్ధి చెంది, ఆ తర్వాత మహమ్మారి దగ్గరికి రాదనే ప్రచారం ఉంది. మరి ఒక్కొక్కరు మూడుసార్లు కరోనా బారిన పడడం ఏంటో వైద్య నిపుణులు తేల్చాల్సి వుంది.