“సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో, స్వార్థ రాజకీయాలతో ఆగిపోయిన అమరావతి నగరాన్ని 2024 నుంచి పునర్నిర్మిస్తాం.. ప్రజలారా ఏం భయపడకండి” అంటూ నారా లోకేష్ పెట్టిన ట్వీట్ ఏడాది చివర్లో అతి పెద్ద జోక్ గా మారుతోంది. మైక్ హుడేమా అనే అతను అమరావతి గ్రీన్ క్యాపిటల్ అంటూ పెట్టిన ఓ వీడియోకు లోకేష్ ఇచ్చిన రిప్లై ఇది.
జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అమరావతిని అడ్డుకున్నాడనుకుందాం. ఆ మాత్రం విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు అవసరం, అంతవరకు లోకేష్ బాగానే ఆలోచించాడు. మరి 2024 సంగతేంటి? నాలుగున్నరేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం ఏంటి? ఇంతకంటే పెద్ద జోక్ ఇంకేదయినా ఉంటుందా?
చంద్రబాబు జనాల్ని భ్రమరావతి భ్రమల్లోకి నెడితే, లోకేష్ బాబు మాత్రం పూర్తిగా భ్రమల్లోనే మగ్గిపోతున్నారు.175 మంది ఎమ్మెల్యేలున్న ఏపీ శాసన సభలో టీడీపీ స్కోర్ 23. పోనీ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపినా 294 సీట్లకు టీడీపీకి దక్కింది 23మాత్రమే. ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమి ఇది. చివరకు 23లో సింగిల్ డిజిట్ మిగులుతుందో లేదో కూడా అనుమానమే. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు మళ్లీ తమ పార్టీ వెలిగిపోతున్నట్టు కలలు కంటున్నారు. ఏకంగా 2024లో అధికారంలోకి వచ్చినట్టు, అమరావతిని నిర్మించినట్టే చెబుతున్నారు.
అసలు రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో ఆయనకు తెలియదా? జగన్ సంక్షేమ పథకాలు, స్వయంపాలన కోసం ప్రవేశపెట్టిన సచివాలయం వంటి ఆలోచనలు.. ప్రజా క్షేత్రంలో ఎంత విజయవంతం అయ్యాయో లోకేష్ కి తెలియంది కాదు. టీడీపీ స్వయంకృతాపరాథంతో రోజురోజుకీ పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారవుతోంది. ఇంగ్లిష్ మీడియం విషయంలో చేసిన రాద్ధాంతం, మూడు రాజధానులను వ్యతిరేకించడంతో ఆ పార్టీపై ప్రజాగ్రహం మరింత పెరిగింది. ఇలాంటి చౌకబారు విమర్శలే చేస్తుంటే.. వచ్చే ఐదున్నరేళ్లలో మరింత దిగజారడం ఖాయం.
మరోవైపు బీజేపీతో కలసి జనసేన పుంజుకోవాలని చూస్తుండటంతో.. 2024లో టీడీపీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడుతుందనే అంచనాలున్నాయి. ఇలాంటి టైమ్ లో లోకేష్ చేసిన కామెడీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. ఇంకా భ్రమల్లోనే ఉన్నావా భ్రమేష్ అంటూ.. సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. కనీసం 2024లోనైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తావా అంటూ మరికొందరు చురకలంటిస్తున్నారు.