గెలిచిన తరువాత సంబరాలు తప్ప మరేం వుండకపోవచ్చు. కానీ ఓడిన తరువాత ఆలోచించాల్సింది చాలా వుంది. కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓటమికి కారణాలను తెలుగుదేశం పార్టీ తప్పకుండా విశ్లేషించుకోవాల్సి వుంటుంది. పైకి ఎన్ని కబుర్లు అయినా చెప్పొచ్చు, ఎన్ని ఆరోపణలు అయినా చేయొచ్చు. కానీ వాస్తవాలను అంతర్గతంగానైనా విశ్లేషించుకోవాల్సి వుంటుంది.
కుప్పంలో బెదిరించి వుండొచ్చు. భయపెట్టి వుండొచ్చు. కానీ ఇలా బెదిరింపులకు, భయానికి ఎంత మంది లొంగి వుండొచ్చు. ఎంతయినా అది చంద్రబాబు స్వంత ప్రదేశం. ఆయనతో అక్కడి ఓటర్లకు ఎంతో కొంత అనుబంధం వుంటుంది కదా? ఎంత బెదిరించినా, భయపెట్టినా, లోపలకు వెళ్లిన తరువాత ఓటు వేసేది ఓటరే కదా. మరి ఎందుకు వేయలేదు?
రిగ్గింగ్ నో మరోటో ఆరోపణ చేసినపుడు టిడీపీ కేడర్ మాటేమిటి? వారంతా ఏం చేస్తున్నారు? మరీ అంత బహరింగంగా బరి తెగించి చేసారు అని అనడానికి కూడా లేదు. ఏమాత్రం అవకాశం వున్నా ఆ నాలుగు మీడియా సంస్థలు వైకాపాను తూర్పారపడతాయి. పదుగురు జనాలు వెనక్కు తిరిగి వున్న ఓ ఫొటోను ప్రచురించి, అదిగో పారిపోతున్న నకిలీ ఓటర్లు అని ప్రచారం చేసిన ఘనత ఆ మీడియాది. ఎదర నుంచి ఫోటో వేసి వుంటే, వాళ్లు అసలో, నకిలీనో తెలిసేది. వెనక నుంచి వేసి, ఏమైనా రాసేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకోవడం ఆత్మ వంచన తప్పమరొటి కాదు.
సరే, కుప్పం సంగతి అలా వుంచుదాం. విశాఖలో ఏమయింది. సెంటిమెంట్, జనసేన, భాజపా, తెలుగుదేశం కలిసి మరీ పోరాడాయి. మరి అక్కడ ఈ రిగ్గింగ్ వగైరా ఆరోపణలు కూడా లేవు. అయినా ఎందుకు గెలవలేదు? 2024లో భాజపా, జనసేన తనకు కుడి ఎడమల వుంటే చాలు అధికారం పట్టేసుకోవచ్చు. ఒక్కసారి అధికారం వస్తే చాలు మళ్లీ వ్యవస్థలు అన్నింటిలో తమ మనుషుల్ని చొప్పించి, రాజధాని భూముల వ్యాపారం షురూ చేసి, అయిదేళ్ల నష్టాలన్నీ తమ వర్గానికి పూరించేయవచ్చని కలలు కంటున్నారు చంద్రబాబు. కానీ విశాఖలో వచ్చిన ఫలితం ఆ కలలను కలవరపరుస్తోంది కదా?
తెలుగుదేశం ముందుగా తెలుసుకోవాల్సింది ఒకటి వుంది. ట్విట్టర్, సోషల్ మీడియా వేరు, గ్రౌండ్ లో వర్క్ వేరు. ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో కామెంట్లు పెట్టే బ్యాచ్ ఎంత మంది ఓట్లు వేస్తారు? విదేశాల్లో, హైదరాబాద్ లో వేరే పనులు చేసుకుంటూ, జీతాలు అందుకుంటూ, అందుబాటులో వున్న కంప్యూటర్లు, నెట్ లు వాడి ఈ సులువైన పని కానిస్తున్నారు. కానీ కింద గ్రౌండ్ లో కార్యకర్తలు కనిపించడం లేదు. పని చేసే నాయకులు అయితే అసలే కనిపించడం లేదు.
గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి యువ కార్యకర్తలు లేరు. కావాలంటే గ్రామాలకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం యువత జనసేన వైపు, మరి కొంత వైకాపా వేపు వెళ్లిపోయింది. ఇక మిగిలింది నడిమి తరం నాయకులు. వీరిలో చాలా మంది సైలంట్ గా వున్నారు. గతంలో సంపాదించినవి కాపాడుకోవాలి అంటే అలా వుండడం ఉత్తమం అని వారికి తెలుసు. అందుకే అలా వున్నారు. వీరు 2024 నాటికి అయినా రంగంలోకి దిగుతారా? అంటే అనుమానమే. ఆరోజు గాలివాటం బట్టి వుంటుంది వ్యవహారం.
మరోపక్క మేం అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి తాట తీస్తాం అంటున్నారు లోకేష్. ఇప్పటికే పలువురు వైకాపా కార్యకర్తలు వివిధ కారణాలతో జైళ్లలో వున్నారు. వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఈ తాట తీస్తారేమో అనే బ్యాచ్ భయం కచ్చితంగా మరింత పట్టుదలగా వైకాపా కోసం పని చేస్తారు. ఎందుకంటే, ఎక్కడ లోకేష్ అధికారం వస్తే తాట తీస్తారో అనే భయం. బాబు వస్తే ఈ అయిదేళ్ల పగను తీర్చుకుంటారో అన్న భయం.
అంటే వైకాపా జనాలు చావో రేవో అన్నట్లు పోరాడతారు. తేదేపా లో మిగిలిన వారు తప్పదు అన్నట్లు పోరాడతారు. ఎక్కడ లోకేష్ వస్తేనో అన్న భయం వైకాపాకు వుంటుంది. ఎందుకంటే వస్తే తాట తీస్తా అంటున్నారు కదా. తేదేపా జనాలకు ఆ భయం లేదు. ఇప్పుడు వున్న పరిస్థితే భవిష్యత్ లోనూ వుంటుంది. లేదా మెరుగుపడుతుంది. ఇంతకన్నా దిగజారదు.
లోకేష్ తాట తీస్తా అధికారంలోకి వచ్చాక అన్న మాటల కారణంగా, గట్టిగా వైకాపా కోసం పని చేసే వర్గాలు ఏవీ అంటే, విలేజ్ వాలంటీర్లు, విలేజ్ సెక్రటేరియట్ ఉద్యోగులు, వాన్లు తీసుకుని, ఇంటింటికీ రేషన్ ఇచ్చేవారు,. నామినేషన్ పనులు చేస్తున్నవారు, ఏదో ఒక అధికారిక పదవి వున్నవారు, వైకాపాకు అనుకూలంగా వున్న ఉద్యోగులు ఎవరైనా వుంటే వారు. ఇలా వీరంతా లోకేష్ తాట తీతకు భయపడయినా వైకాపా కోసం పని చేస్తారు.
ఇదిలా వుంటే జగన్ ఇస్తున్న పథకాలు ఆగడం లేదు. ఎంత అడ్డకులు పెట్టి, డబ్బులు అందకుండా చేస్తున్నా, ఏదో ఒకటి చేసి కొనసాగిస్తున్నారు. 2024 మేనిఫెస్ట్ లో తెలుగుదేశం ఈ పథకాల గురించి తమ ఆలోచన స్పష్టం చేయాల్సి వుంటుంది. కానీ జనం దాన్ని నమ్మాలి కూడా. లేదూ అంటే ఆల్రెడీ కిందా మీదా పడి ఇస్తున్న జగన్ నే నమ్ముతారు.
ఇక జనసేన పొత్తు. జనసేనతో కలిస్తే గెలిచేస్తాం అనే నమ్మకంతో స్వంత పార్టీని బలోపేతం చేయకుండా వున్నారు. నిజానికి 2019లో కూడా ఈ పొత్తు లోపాయకారీగా కొనసాగింది కానీ ఓట్ల బదలాయింపు జరగలేదు. ఇప్పుడు లోకల్ ఎన్నికల్లో కూడా ఇదే పొత్తు గ్రామాల్లో జరిగింది.అయినా ఫలితం లేదు. లేటెస్ట్ గా విశాఖలో కూడా అదే జరిగింది అయినా ఫలితం శూన్యం.
తేదేపా చేయాల్సింది జనాలను తాటతీస్తాం అనడం కాదు. జనసేన వైపు, వైకాపా వైపు మళ్లిన యువ కార్యకర్తలను చేరదీయాలి. అయిదేళ్ల పాటు సంపాదించుకుని, అజీర్ణంతో కూర్చున్న నాయకులను కదిలించాలి. జనసేన మీద ఆధారపడడం అనేది లాస్ట్ ఎజెండా గా పెట్టుకుని తమ బలం పెంచుకునే మార్గం చూడాలి. ఇలా చేయకుండా బుచ్చయ్య చౌదరి, లోకేష్ లాంటి వాళ్లు ట్విట్టర్ నే నమ్ముకుని కామెంట్లు చేసుకుంటూ ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నన్నాళ్లు వ్యవహారం ఇలాగే వుంటుంది.
తమ చాతకాని తనం లేదా తప్పు కప్పు పుచ్చుకోవడానికి రిగ్గింగ్, అక్రమాలు లాంటి పదాలు అన్నీ వెదుక్కోవడం తప్ప చేసేదేమీ వుండదు.
ఆర్వీ