సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ సర్కార్‌కు తలనొప్పిగా మారిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు ఇవాళ తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ చిలకలగూడ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల నమోదైన కేసుల్లో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికి ఆయన రెండు నెలలకు పైగా జైల్లో ఉంటున్నారు.
తన యూట్యూబ్ న్యూస్ చానల్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేసీఆర్ కుటుంబంపై తీన్మార్ మల్లన్య వ్యక్తిగత దాడి చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. కేసీఆర్, ఆయన తనయ కవిత, తనయుడు కేటీఆర్‌లను విమర్శించడంలో జర్నలిజం విలువలను అతిక్రమించారనేది ప్రభుత్వ పెద్దల వాదన.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో తీన్మార్ మల్లన్నపై బెదిరింపులు, బ్లాక్మెయిల్ తదితర ఆరోపణల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. ఇవన్నీ ప్రభుత్వం కక్ష కట్టి నమోదు చేసిన కేసులని మల్లన్న మద్దతుదారులు చెబుతున్న మాట. తీన్మార్ మల్లన్నపై ఓ కన్నేసి ఉంచిన తెలంగాణ సర్కార్ అదును చూసి దెబ్బకొట్టింది. రెండునెలలకు పైగా జైలు ఊచలు లెక్క పెట్టేలా చేయగలిగింది.
ఇదిలా వుండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మల్లన్న చుక్కలు చూపించారు. రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో పాదయాత్రకు కూడా ఆయన శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ లోపు అరెస్ట్‌కు దారి తీసింది. త్వరలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ పంథాపై జరుగుతున్న ప్రచారంపై మల్లన్న ఏం చెబుతారో చూడాలి!