ఎవరో అన్నారని కాదు కానీ… బీజేపీ ఇంకెన్నెళ్లు ఇలా మసిపూసి మారేడు కాయలు చేయడం, పక్కదారి పట్టించే రాజకీయాలతో దేశంలో బండిలాగించాలని చూస్తుందనేది ప్రశ్న! అధికారం అంది ఏడేళ్లు గడిచిపోయాయి.. ఇప్పటికీ అన్నింటికీ సాకులు చెప్పడం తప్ప మరో వ్యథ లేకుండా పోతోంది. ఇక ఇప్పుడు పెట్రో ధరల గురించి బీజేపీ కొత్త నాటకానికి తెరతీయడం సామాన్యులను విస్తుపోయేలా చేస్తోంది.
గత రెండేళ్లలో పెట్రోధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసింది కేంద్రం. ఎక్సైజ్ డ్యూటీని విపరీత స్థాయికి చేర్చింది కేంద్రం. పెట్రో ఉత్పత్తులపై చార్జీని పెంచేయడానికి పార్లమెంట్లో చట్టం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం! తమకు ఉన్న తిరుగులేని బలాన్ని ఉపయోగించుకుని పార్లమెంట్ లో చట్టం పెట్టుకుని ఆమోదించుకున్నారు.
ఇక రెండేళ్ల వ్యవధిలో లీటర్ పెట్రోల్ పై 40 రూపాయల మేర పెంచుకుని, ఇప్పుడు అందులో ఐదు రూపాయలను మాత్రమే తగ్గించి.. అనవిగాని రాజకీయం చేయడం బీజేపీకే చెల్లుతోంది! రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గించాలని బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారనే వార్తలు చూస్తే.. కమలం పార్టీ నేతల అతి తెలివిని చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తోంది!
చివరకు బీజేపీకి ఇంతకు దిగజారిందా అనుకోవాల్సి వస్తోంది సామాన్యుడు. కేంద్రంలో తిరుగులేని మెజారిటీ ఉన్న పార్టీ, గాంధీ తర్వాత మోడీనే అని చెప్పుకుంటున్న పార్టీ.. ఇలాంటి డొంక తిరుగుడు రాజకీయాలు, చీప్ ట్రిక్స్ తో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉండటం విడ్డూరం.
నలభై రూపాయల రేటు పెంచారు రెండేళ్ల వ్యవధిలో, ఇదే సమయంలో రాష్ట్రాలేమీ వ్యాట్ ను పెంచుకుంటూ పోలేదు! తాము పెంచిన దాంట్లో పదో వంతు ధరను తగ్గించి, రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాలంటూ తాము అధికారంలో లేని చోట బీజేపీ రాజకీయం మొదలుపెట్టింది! అంటే ఈ రాజకీయం చేయడానికే ఆ ఐదు రూపాయల ధర తగ్గించినట్టుగా ఉన్నారు. రాజకీయం మీద తప్ప కమలం పార్టీకి మరో చింత లేదనే విషయాన్ని చాటుతూ ఉంది ఈ వ్యవహారం.
ప్రజల వాస్తవ సమస్యల పట్ల స్పందించడం కానీ, వాటి పరిష్కారించడం గురించి కానీ గత ఏడేళ్లలో బీజేపీ చేసింది శూన్యం. లేని బూచిలను చూపించడం, ఇలాంటి దారి మళ్లించే రాజకీయాలు చేయడమే తమ మనుగడకు ప్రాణమని బీజేపీ ఇలా చాటుకుంటూ ఉంది. ఇప్పుడు వ్యాట్ లు తగ్గించాలని తాము రోడ్డుకు ఎక్కితే.. రెండేళ్ల వ్యవధిలో లీటర్ పెట్రోల్ పై 35 రూపాయలు పెరిగిన వైనాన్ని ప్రజలంతా మరిచిపోతారనే సిల్లీ ఎత్తుగడతో బీజేపీ మరింత పలుచన కావడమే తప్ప.. మరో ప్రయోజనం లేదని ఆ పార్టీ నేతలు గ్రహించలేకపోతున్నట్టుగా ఉన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అడ్డదారి వ్యూహాలతో చిత్తవ్వడం తప్ప, ఇదేదో గొప్ప వ్యూహం అనుకోవడం చేజేతులారా చేసుకోవడంలో భాగమే! ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు బహుపరాక్!