కరోనా కారణంగా ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఈ ఏడాది మార్చిలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. సీఎం అయిన తర్వాత ఆరు నెలల కాలంలో అసెంబ్లీకి ఆయన ఎన్నిక కావాల్సి ఉంది. శాసన మండలి లేకపోవడంతో ప్రత్యక్ష ఎన్నికలు అనివార్యం. ఉత్తరాఖండ్ లో ఆల్రడీ రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయినా కూడా తిరత్ సింగ్ రావత్ రాజీనామా దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఉత్తరాఖండ్ వ్యవహారం, ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీటు కిందకి నీళ్లు తెచ్చేలా ఉంది. మమతా బెనర్జీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆరు నెలల్లోగా ఆమె కూడా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. ఇక్కడ కూడా అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉన్నాయి, మమత కావాలంటే రాజీనామా చేయడానికి ఎవరైనా రెడీ అంటారు కూడా. విశేషం ఏంటంటే.. ఉత్తరాఖండ్ లాగే, వెస్ట్ బెంగాల్ లో కూడా శాసన మండలి లేదు. కచ్చితంగా మమత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం అని చెప్పొచ్చు.
మే 5న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్రడీ రెండు నెలలు పూర్తయ్యాయి. మరో 4 నెలలు మాత్రమే సమయం ఉంది. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గలేదు, అటు థర్డ్ వేవ్ భయాలు కూడా ఉన్నాయి. ఈ దశలో ఎన్నికల కమిషన్, ఉప ఎన్నికలకు సాహసిస్తుందా, కేంద్రంలో ఉన్న బీజేపీ దానికి అనుమతిస్తుందా అనేది అనుమానమే.
బెంగాల్ లో బీజేపీ నేతలకు చుక్కలు చూపెడుతున్న మమతా బెనర్జీని అడ్డుకోడానికి కేంద్రం దేనికైనా సిద్ధమంటుంది. పైగా రాజ్యాంగ సంక్షోభం సృష్టించి క్యాష్ చేసుకోవడం బీజేపీకి కొత్త కాదు. అలాంటి అనుభవం ఆ పార్టీకి మెండుగా ఉంది. కాబట్టి మమతను కుర్చీ దింపడానికి ఆ పార్టీ వెనకాడకపోవచ్చు. పైగా రాజ్యాంగబద్ధంగానే ఆమెను పదవి నుంచి దింపే అవకాశం ఎదురుగా ఉంది.
సో.. కేంద్రం కనుసైగతో, ఎస్ఈసీ ఎన్నికలకు వెనకాడటం, మమత రాజీనామా చేయాల్సి రావడం అన్నీ లాంఛనమే అంటున్నారు. పైగా ఉత్తరాఖండ్ లో సొంత పార్టీ సీఎంతోటే రాజీనామా చేయించాం కదా, మా నిబద్ధతను ఎలా శంకిస్తారని బీజేపీ లాజిక్ కూడా తీయొచ్చు. మొత్తమ్మీద ఉత్తరాఖండ్ వ్యవహారంతో మమత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీన్ని ఆమె ఎలా ఎదుర్కొంటారో చూడాలి.