ఆరోగ్య రంగంలో ఉన్న సిబ్బంది మొత్తం తప్పనిసరిగా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన ఇటలీలో ఉంది. ఇది నిర్బంధం. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికేట్ చూపిస్తేనే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఇంటికే. అయితే ఓ హెల్త్ వర్కర్క్ మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేదు. దీని కోసం అతడు వినూత్నంగా ఆలోచించాడు. కానీ మోసం బయటపడింది, సదరు వ్యక్తి ఉద్యోగం ఊడింది.
వ్యాక్సిన్ సర్టిఫికేట్ కోసం నకిలీ భుజం తయారు చేయించుకున్నాడు ఇటలీకి చెందిన హెల్త్ వర్కర్. తన భుజం చుట్టూ సింథటిక్ తో చేసిన నకిలీ భుజాన్ని అతికించుకున్నాడు. నర్స్ షర్ట్ ఎత్తి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేతికి అతడి భుజం చల్లగా, రబ్బర్ లాగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి ఇంకాస్త గట్టిగా రుద్దడంతో అసలు విషయం బయటపడింది.
దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది సదరు నర్స్. అంతర్గతంగా విచారణ జరిపిన అధికారులు, సదరు వ్యక్తి కావాలనే అలా చేశాడని, వ్యాక్సిన్ నుంచి తప్పించుకునేందుకే ఈ ప్రయత్నం చేశాడని నిర్థారించారు. అతడ్ని ఉద్యోగం నుంచి తొలిగించారు.
ఇండియాలో వ్యాక్సిన్ వేయించుకోకుండా తప్పించుకు తిరుగుతున్న జనాల్ని చాలామందిని చూశాం. వాటికి సంబంధించిన వీడియోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. కానీ ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా కొంతమంది వ్యాక్సినేషన్ పై అపోహలతో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఫస్ట్ వేవ్ లో ఇటలీకి తీరని నష్టం జరిగిన విషయం తెలిసిందే.