ప్రశాంత్ కిషోర్ టీమ్ కరెక్టుగా చెబుతుందా?

అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రజలు తన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? ఏ విషయంలో హ్యాపీగా ఉన్నారు? ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు? వ్యతిరేకత పెరుగుతోందా? … ఇలాంటివి తప్పక తెలుసుకుంటాడు.…

అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రజలు తన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? ఏ విషయంలో హ్యాపీగా ఉన్నారు? ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు? వ్యతిరేకత పెరుగుతోందా? … ఇలాంటివి తప్పక తెలుసుకుంటాడు. దేశ ప్రధాని అయినా అంతే. ఈ విషయాలు తెలుసుకోవాలంటే అందుకు అవసరమైన ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి. 

పార్టీలోనూ వ్యవస్థ ఉంటుంది. మీడియాలో ఎప్పటికప్పుడు కథనాలు వస్తుంటాయి. ప్రస్తుతం అధికార పార్టీలకు సొంత మీడియా కూడా ఉంది. అయితే ప్రభుత్వ ఏజెన్సీలుగానీ, సొంత మీడియాగానీ సరైన సమాచారం ఇవ్వకపోవచ్చు. వాస్తవాలు చెబితే అధినేతకు ఆగ్రహం వస్తుందని భయపడొచ్చు. అందుకే పాలకులు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా తమ పాలనపై సర్వే చేయిస్తుంటారు. 

ఇప్పుడు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ఆ పనే చేయిస్తున్నారట. కేసీఆర్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ప్రధాన ప్రతిపక్షాలు చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే మీడియా కూడా ఇదే చెబుతోంది. దానికి తగ్గట్లుగానే కొన్ని కీలక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయింది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కారణాలు ఏవైనా తన జాతకం ఎలా ఉందో చూపించుకోవాలని కేసీఆర్ అనుకున్నారు. 

ఇందుకోసం ఆయన గొప్ప జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లారనుకుంటే పొరబడ్డటే. ఆయన జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళలేదు. రాజకీయ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లారని తెలుస్తోంది. ఎవరా రాజకీయ జ్యోతిష్కుడు ? ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ జ్యోతిష్కుడు కూడా కాదు. 

రాజకీయ వ్యూహకర్త. ఆయనే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేరకత పెరిగిందా? పెరిగితే దానికి కారణాలేమిటో సర్వే చేసి చెప్పేందుకు పీకే టీం ఇప్పటికే రంగంలోకి దిగింది. కేసీఆర్ ఎక్కువగా ప్రైవేటు సంస్థల సర్వేలు, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్‌పై ఆధారపడుతూ ఉంటారు. 

అయితే అవి పూర్తి స్థాయిలో వాస్తవికంగా ఉండటం లేదన్న అభిప్రాయంతో ఉన్న ఆయన పీకే టీమ్‌ ద్వారా సర్వే చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. పీకే టీఎం సర్వే రిపోర్ట్ ఆధారంగా దిద్దుబాటు చర్యలతో పాటు ప్రజల నమ్మకాన్ని గెల్చుకోడానికి తగిన వ్యూహాన్ని కేసీఆర్ సిద్ధం చేసుకుంటారని చెబుతున్నారు. 

అయితే అపర చాణక్యునిగా పేరు పొందిన కేసీఆర్ రాజకీయ వ్యూహాల కోసం పీకేను నమ్ముకుంటారని టీఆర్ఎస్ వర్గాలు అనుకోవడంలేదు. ఈ విషయాన్ని నమ్మడంలేదు. అయితే జాతీయ రాజకీయాల విషయంలో మాత్రం పీకే సలహాలను కేసీఆర్ తీసుకుంటారని భావిస్తున్నారు. మమతా బెనర్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీల కూటమికి టీఆర్ఎస్‌ను దగ్గర చేసేందుకు పీకే తన టీం ద్వారా ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. ఇటీవల కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రశాంత్ కిషోర్‌తో ఓ సారి చర్చించారని.. దానికి కొనసాగింపుగానే ఆయ టీం హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశం అయిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

మొత్తంగా మూడు అంశాలపై పీకే టీమ్‌ వర్క్ చేయాలని కేసీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితం రావడానికి దారితీసిన కారణలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్నదానిపై పీకే టీం సలహాలు, సూచనలు కేసీఆర్ అడిగినట్లుగా సమాచారం. 

అయితే ప్రశాంత్ కిషోర్ తను నేరుగా పని చేయబోవడం లేదు. ఆయనకు చెందిన “ఐ ప్యాక్” సంస్థ మాత్రం రాజకీయ పార్టీలకు సేవలు అందిస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించడంతో ఆయన బృందం ప్రత్యేకంగా ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌తో సమావేశమైనట్లుగా తెలుస్తోంది.