ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కివీ స్పిన్నర్ అజాజ్ పటేల్ అరుదైన ఫీట్ ను సాధిస్తున్నాడు. భారత మూలాలున్న ఈ క్రికెటర్ న్యూజిలాండ్ జట్టుకు ఆడుతున్నాడు. తొలి టెస్టు మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ స్పిన్నర్, రెండో టెస్టులో మాత్రం భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాశిస్తున్నాడు. నిన్న తొలి రోజు నాలుగు వికెట్లను తీసి ఆకట్టుకున్న అజాజ్, ఈ రోజు ఫస్ట్ సెషన్లోనే మరో రెండు వికెట్లను పడగొట్టాడు. దీంతో అతడి ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి.
భారత జట్టు ఈ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లను కోల్పోయే సమయానికి ఆ ఆరు వికెట్లూ అజాజ్ పటేల్ ఖాతాలోనే చేరడం గమనార్హం. తొలి ఆరు వికెట్లనూ ఒకే బౌలర్ తీయడం విశేషమే. ఇది వరకూ తొలి నాలుగు వికెట్లనూ తీసిన బౌలర్లు కొంతమంది ఉన్నారు. ఇక ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లనూ పొందిన ఇద్దరు బౌలర్లున్నారు.
జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లను సాధించిన ఘనతను కలిగి ఉన్నారు. మురళీ ధరన్ ఒకే ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్ల వరకూ తీశాడు. మురళీ కన్నా ముందే కపిల్ దేవ్, అబ్దుల్ ఖాదీర్ తో సహా పలువురు బౌలర్లు ఒకే ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లు తీశారు. ఇక ఒకే ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లను తీసిన వారూ పలువురు ఉన్నారు.
ఇప్పుడు ఈ అరుదైన రికార్డులు అజాజ్ పటేల్ ముందున్నాయి. తొలి ఆరు వికెట్లను సాధించిన ఈ బౌలర్ ఒకే ఇన్నింగ్స్ లో వీలైనన్ని ఎక్కువ వికెట్లను సాధించే అవకాశాన్ని కలిగి ఉన్నాడు. టీమిండియాకు సంబంధించి మిగిలిన నాలుగు వికెట్లో అజాజ్ ఎన్నింటిని తన ఖాతాలోకి వేసుకుంటాడనేది ఆసక్తిదాయకమైన అంశమే.