బీజేపీ మరో కాంగ్రెస్ అవుతోందా..?

ఏపీలో బీజేపీ మరో కాంగ్రెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కాదు, అధ్యక్షుడు కూడా కరువైన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ కూడా నాయకులు లేక వెలవెలబోతోంది. అందర్నీ అరువు తెచ్చుకుంటోంది. …

ఏపీలో బీజేపీ మరో కాంగ్రెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కాదు, అధ్యక్షుడు కూడా కరువైన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ కూడా నాయకులు లేక వెలవెలబోతోంది. అందర్నీ అరువు తెచ్చుకుంటోంది. 

సహజంగా బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ పదవులైనా, నామినేటెడ్ పోస్టులైనా వారికే దక్కుతాయి. కానీ ఈసారి ఎందుకో అధిష్టానం కాస్త వెరైటీగా ప్రయత్నిస్తోంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేనివారికి, పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తోంది. కాషాయం కండువా కప్పి మర్యాదలు చేస్తోంది.

ఎవ్వరిపై నమ్మకం లేదు..

ఇటీవేల ఏపీ బీజేపీ కోర్ కమిటీ నియామకం జరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మొత్తం 13మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. అయితే ఈ కమిటీలో దాదాపుగా అందరూ కొత్తవాళ్లే ఉండటం విశేషం.

కొత్తవారంటే యువతకు పెద్దపీట వేశారనుకుంటే పొరపాటే, బయటి పార్టీలనుంచి వచ్చినవారికి అనూహ్యంగా రెడ్ కార్పెట్ పరిచారు. టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంద్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ కమిటీలో ఉన్నారు. వీరంతా బీజేపీలో పుట్టి పెరిగినవారు కాదు. అందరూ అరువు నాయకులే.

బీజేపీని నమ్ముకున్నవారి పరిస్థితి ఏంటి..?

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని తెలిసినా కూడా కొంతమంది హిందూత్వవాదంపై నమ్మకం ఉంచుకుని బీజేపీ కోసం పనిచేశారు. కాషాయ జెండా మోశారు. అలాంటి వారికి పక్క పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా కూడా వెళ్లలేదు. 

తీరా ఇప్పుడు ఏపీ బీజేపీలో అంతా బయటి పార్టీల నుంచి వచ్చిన వారిదే పెత్తనం అని తేలిపోయే సరికి పాత నాయకులంతా దిగులు పడ్డారు. ఎక్కడికక్కడ సర్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

2024 నాటికి పరిస్థితి ఏంటి..?

2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక గాలి బలంగా వీస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుసగా రెండు సార్లు కేంద్రంలో బీజేపీ చక్రం తిప్పినా ఏపీలో ఏమీ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు కేంద్రంలోనే జెండా పీకేసే పరిస్థితి వస్తుంటే ఏపీలో ఇక పార్టీ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తెలంగాణలో మాత్రం రోజు రోజుకీ బీజేపీ బలపడుతుంటే, ఏపీలో మాత్రం నానాటికీ దిగజారిపోతోంది. రాబోయే రోజుల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మరింత కిందకి జారిపోవడం ఖాయం. 

2024లో బీజేపీ సొంతగా పోటీ చేస్తే, అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుందంటున్నారు విశ్లేషకులు. దాదాపుగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. బీజేపీ కూడా అలాంటి స్థితికే మెల్లమెల్లగా చేరుకుంటోంది.