ఇన్ఫ్రా రంగంలో ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేసిన ఎంఇఐఎల్ తాజాగా థర్మల్ విద్యుత్ రంగంలోనూ తనదైన ముద్రను వేసింది. తమిళనాడులో రెండు థర్మల్ ప్రాజెక్ట్లను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసింది ఎంఇఐఎల్. నాగపట్టణం దగ్గర 230 ఎకరాల్లో 150 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఈపీసీ పద్ధతిలో నిర్మిస్తున్న మేఘా, ట్యూటికోరిన్లో 525 మెగావాట్ల భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్లను ఈ నెలలో లాంఛనంగా ప్రారంభించనుంది.
తమిళనాడులోని నాగపట్నం వద్ద కేవికే ఎనర్జీ సంయుక్త భాగస్వామ్యంతో 230 ఎకరాల్లో 150 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఈపీసీ పద్ధతిలో ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. ఈనెల 10న దీన్ని గ్రిడ్తో అనుసంధానించారు. ఇప్పటికే 130 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదిరింది. ఇక్కడ బొగ్గును 70శాతం మండించే 530 టీపీహెచ్ (టన్ పర్ అవర్) బాయిలర్ ఉపయోగిస్తున్నారు. బిహెచ్ఈఎల్ రూపొందించిన 150 మెగావాట్ల టర్బైన్ జనరేటర్, ఎయిర్కూల్డ్ కండెన్సర్ను ఈ ప్లాంట్‌లో బిగించారు. 125 మీటర్ల చిమ్నీ(పొగగొట్టం)ని ఎంఈఐఎల్ నిర్మించింది. నాగాయ్లో వినియోగించిన స్టీల్లో 3700 మెట్రిక్ టన్ను సొంత యూనిట్లో ఎంఈఐఎల్ ఫ్యాబ్రికేట్ చేసింది. ఇక్కడ ఉత్పత్తైన విద్యుత్ను 230 కెవి ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా తిరువరూర్ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా గ్రిడ్కు అనుసంధానించేందుకు అనువుగా 24.6 కిలోమీటర్ల విద్యుత్ లైన్ నిర్మాణాన్ని ఎంఈఐఎల్ పూర్తిచేసింది. ఈ ప్లాంట్లో గంటకు 114 టన్నుల బొగ్గును వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. వారానికి సరిపడా నిల్వ ప్లాంట్లో అందుబాటులో ఉంటుంది.
అంతర్జాతీయస్థాయి బిడ్డింగ్లో పాల్గొని దక్కించుకున్న ట్యుటికోరిన్లో ఎస్ఈపీసీ ప్రైవేట్ లిమిటెడ్కు 525 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది ఎంఈఐఎల్. ప్లాంట్కు పునాది నుంచి విద్యుత్ ఉత్పత్తి వరకూ అన్ని పనులు చేపట్టడం అర్హతలుగా ఎస్ఈపీసీ పేర్కొంది. ఈ నిబంధలన్నింటిలోనూ అర్హత సాధించిన ఎంఈఐఎల్ ఈపీసీ పద్ధతిలో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. సివిల్ పనులు 90శాతం పూర్తికాగా, ఎలక్ట్రో, మెకానికల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బాయిర్ హెడ్రో టెస్ట్ పూర్తి చేసుకున్న ఈ ప్లాంట్ తన కార్యకలాపాలను త్వరలో ప్రారంభించనుంది. ట్యుటికోరిన్లోని విఓ చిదంబరం పోర్ట్ ట్రస్ట్ ఎస్టేట్ పరిధిలోని 36.81 హెక్టార్ల లీజు భూమిలో ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. బొగ్గు జెట్టీ, కోల్ కన్వేయర్, నీటి శీతలీకరణ విధానం (పైప్లైన్, ఇన్టేక్, అవుట్ఫాల్) కూడా పోర్ట్ ట్రస్ట్ ఎస్టేట్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడ విడుదలయ్యే బూడిద నిల్వ కేంద్రంతో పాటు గ్రీన్బెల్ట్ను ప్లాంట్కు 30 కిలోమీటర్ల దూరంలో తూత్తుకుడి జిల్లా వడక్కు కరసెరీ గ్రామంలో వంద హెక్టార్ల విస్తీర్ణంలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది.
ఈప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తమిళనాడు జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాన్జెడ్కో) కు సరఫరా చేస్తారు. దీనికి గాను ఒట్టిపిదరం సబ్స్టేషన్ వరకూ 48 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణ బాధ్యతను టాన్జెడ్కో ఎంఈఐఎల్కు అప్పగించింది. తమిళనాడు విద్యుత్ సంస్థతో ఎస్ఈపీసీ 30 ఏళ్ల విద్యుత్ కొనుగోు ఒప్పందం చేసుకుంది. ఎన్ఈపీసీ దేశీ, విదేశీ బొగ్గును ఈ ప్లాంట్కు సరఫరా చేస్తుంది. ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాంట్లో బీహెచ్ఈఎల్ తయారు చేసిన 1700 టీపీహెచ్ సామర్ధ్యంతో కూడిన బాయిలర్, 555 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న టర్బైన్, జనరేటర్ ఉపయోగించనున్నారు. వీటిని కూడా అదే సంస్థ తయారు చేసింది. శీతలీకరణ వ్యవస్థ గంటకు 6600 క్యూమెక్స్తో ఏర్పాటు చేశారు. గంటకు 6700 క్యూమెక్కుల నీటిని సముద్రం నుంచి దీనికోసం తీసుకుంటారు. ఎంఈఐఎల్ ఈ ప్లాంట్లో 275 మీటర్ల ఎత్తు ఉన్న చిమ్నీని నిర్మించింది. పవర్ప్లాంట్, బంకర్ బిల్డింగ్కు 15 వేల మెట్రిక్ టన్నుల స్టీల్ను తన సొంత యూనిట్లో ఫ్యాబ్రికేట్ చేసి ఎంఈఐఎల్ వినియోగించింది. సముద్రపు నీటిని లోపలకు తీసుకుని, వినియోగించిన తరువాత బైటకు వదిలేందుకు ఏర్పాటు చేసిన 10 కిలోమీటర్ల పైప్లైన్కు అవసరమైన పైప్ను కూడా ఎంఈఐఎల్ సరఫరా చేసింది.
దేశంలోనే తొలిసారిగా వడోదరా బ్రాంచ్ కాలువపై 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని సర్ధార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ కోసం ఐదు కిలోమీటర్ల పొడవున ఎంఈఐల్ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ కెపిఎంజీ ప్రపంచంలోని వంద సృజనాత్మక మౌలిక సదుపాయాల ఆవిష్కరణ ప్రాజెక్టుల్లో ఇది ఒకటని పేర్కొంది. ఇదే రాష్ట్రంలోని సౌరాష్ట్ర బ్రాంచ్ కాలువపై మూడు చిన్న జల విద్యుత్ కేంద్రాలను ఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తోంది. వీటిలో రెండు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా, మూడో ప్లాంట్ పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని ధూలే జిల్లా సాక్రి వద్ద 50 మెగావాట్లు, చంద్రాపూర్ వద్ద రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహా జెన్కో కోసం ఎంఈఐఎల్ ఫొటోవోల్టిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండం నాగులాపురంలో 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని బిల్డ్ ఓన్ ఆపరేట్(బూట్) విధానంలో ఎంఈఐఎల్ నిర్మించింది. హిమాచల్ ప్రదేశ్లోని లంబాడగ్ వద్ద 25 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఎంఈఐఎల్ సొంతంగా నిర్మిస్తోంది.