ఈ నెలాఖరు వరకూ ఇండియాలో లాక్ డౌన్ ను కొనసాగించడం మేలని అంటోంది మిషిగాన్ వర్సిటీ. ఇప్పటి వరకూ 20 రోజుల లాక్ డౌన్ ను పాటించిన ఇండియా మొత్తం 40 రోజుల పాటు లాక్ డౌన్ ను పాటించడం మంచి ఫలితాలను ఇస్తుందని ఆ వర్సిటీ అధ్యయనకర్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు. కనీసం ఏప్రిల్ 30 వరకూ ఇండియాలో లాక్ డౌన్ ను పాటించడం ద్వారా కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆ అధ్యయనకర్తలు ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకూ లాక్ డౌన్ ఇండియాలో సత్ఫలితాలను ఇచ్చిందని, దాన్ని యథాతథంగా కొనసాగించడమే మేలని ఆ అధ్యయనకర్తలు స్పష్టం చేశారు.
లాక్ డౌన్ ను మరో వారం పొడిగించడం వల్ల కూడా ప్రయోజనం లేదని, ఏప్రిల్ 30 వరకూ అయినా లాక్ డౌన్ ను పాటిస్తే మంచిదని ఆ అధ్యయనకర్తలు స్పష్టం చేశారు. అప్పటికి దేశంలో లాక్ డౌన్ మొత్తం 40 రోజులను పూర్తి చేసుకుంటుంది. విశేషం ఏమిటంటే… 40 రోజుల పాటు ఇలా సర్వం పూర్తిగా బంద్ అయిపోతే.. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుందని ఈ వర్సిటీ అధ్యయనం అభిప్రాయపడుతూ ఉంది.
లాక్ డౌన్ ఇరవై రోజులు పూర్తి అయిపోయిన నేపథ్యంలో కూడా కరోనా కేసుల సంఖ్య ఇండియాలో పెరుగుతూనే ఉంది. ఇప్పుడు రోజుకో వెయ్యి కేసుల వరకూ కొత్తవి బయటపడుతూ ఉన్నాయి. ఇలా నంబర్ పెరుగుతూ ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ పెరుగుదల కనిపిస్తూ ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు ఈ విషయంలో ముందున్నాయి. మిగతా రాష్ట్రాల్లో పెరుగుదల స్వల్ప స్థాయిలోనే ఉంది. ఈ పెరుగుదల గురించి ఆ వర్సిటీ ఏం చెప్పలేదు.
ఆల్రెడీ కరోనా సోకిన వారి వివరాలు ఇప్పుడు బయటపడుతున్నాయా? ఇన్నాళ్లూ లాక్ డౌన్ పాటించడం వల్ల కరోనా సంక్రమించిన వారి నుంచి బయటవాళ్లకు ఆ వైరస్ సోకి ఉండదా? లాక్ డౌన్ మూడో వారం పూర్తి అయ్యాకా.. కొత్తగా రికార్డు అయ్యే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ పోతుందా? ఆరు వారాలు పూర్తయ్యే సరికి దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా జీరో అవుతుందా? అనేవి ఇంకా సమాధానం లేని ప్రశ్నలే!