ప్రపంచంలో కొన్ని రహస్య దేశాలున్నాయి. ఆ దేశాల్లో ఏం జరుగుతున్నదో బయటకు రాదు. ఆ దేశాల్లో నియంతృత్వమే రాజ్యమేలుతోంది. ఏ సమాచారమూ బయటకు రాకుండా అక్కడి ప్రభుత్వాలు నిఘా పెడతాయి. అక్కడ ఇంటర్నెట్, సోషల్ మీడియా పనిచేయవు.
మన దేశంలో మాదిరిగా బోలెడు పత్రికలు, టీవీ చానెళ్లు ఉండవు. కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే పత్రికలు, చానెళ్లు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం చెప్పిన సమాచారం మాత్రమే ఆ చానెళ్లు ప్రసారం చేస్తాయి. ఆ పత్రికలు ప్రచురిస్తాయి.
ఇలాంటి దేశాలు ప్రస్తుతం రెండు కనబడుతున్నాయి. మొదటిది చైనా, రెండోది ఉత్తర కొరియా. కరోనాకు సంబంధించి చైనా నుంచి సమాచారం వస్తోందిగాని, ఉత్తర కొరియాలో పరిస్థితి ఏమిటనేది తెలీడంలేదు.ఉత్తర కొరియాలో కఠిన నియంతృత్వం అమలు జరగుతున్న సంగతి తెలిసిందే. దాన్నలా పక్కనుంచితే చైనా మీద ప్రపంచ దేశాలకు చాలా అనుమానాలున్నాయి.
కరోనా వైరస్ కు చైనా వైరస్ అని పేరు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశాన్ని మొదటి నుంచి నమ్మడంలేదు. కరోనాకు సంబంధించి అక్కడి నుంచి వస్తున్నసమాచారం గాని, వార్తలుగాని పూర్తిగా వాస్తవం కాదని కొన్ని దేశాలు చెబుతున్నాయి. కరోనా పుట్టుకకు కారణమైన ఊహాన్ లో 76 రోజుల లాక్ డౌన్ ఎత్తేశారు. దీంతో కరోనా పై విజయం సాధించామంటూ ప్రజలు ఆనందాతిరేకాలతో సంబరాలు జరుపుకున్నారు. కానీ చైనాలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి.
ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా ఊహాన్ లోనే పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దానికి మందు లేదా వ్యాక్సిన్ కనుక్కోలేదు. పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం అమెరికాలో, చైనాలో, జపాన్ లో , జర్మనీలో వ్యాక్సిన్ కనుక్కోవడంపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఎలుకల మీద, మనుషుల మీద ప్రయోగాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత వాటి ప్రగతి గురించిన సమాచారం లేదు.
ఈ మధ్య శాంఘైలోని వుడెన్ యూనివర్సిటీ, ఊహాన్ లోని చైనా యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్ కలిసి అధ్యయనం చేసి ఆ వివరాలను తమ వెబ్సైట్లలో పెట్టాయట. అయితే చైనా ప్రభుత్వం వెబ్సైట్ల నుంచి ఆ పత్రాలను తొలగించింది. ఆ పత్రాల్లో కరోనా పుట్టుకకు సంబంధించిన సమాచారం ఉందని తెలుస్తోంది. ఆ పత్రాలను తొలగించడం ద్వారా చైనా ప్రభుత్వం కరోనాకు సంబంధించిన రహస్యాలు దాస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు సాగిస్తున్న తరుణంలో తన దేశపు యూనివర్సిటీలు చేసిన పరిశోధనల పత్రాలను బయటి ప్రపంచానికి వెల్లడి కాకుండా చేయడం ఏమిటి ? కరోనా వైరస్ అనేది గబ్బిలాల నుంచి పుట్టిందని ఇప్పటివరకు నమ్ముతున్నారు. కానీ కారణం అదేనా ? కాదా ? అనేది కరెక్టుగా తెలియదు. తన దేశంలోనే పుట్టిన కరోనాకు అసలు కారణం ఏమిటనేది వెల్లడించాల్సిన బాధ్యత చైనాకు ఉంది.