సీఎంతో మాట్లాడి మ‌ళ్లీ వ‌స్తాం…ఫ్లీజ్ వెయిట్‌!

మంత్రుల క‌మిటీతో ఉద్యోగ సంఘాల నేత‌ల కీల‌క చ‌ర్చ‌ల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. ఉద్యోగుల డిమాండ్ల‌పై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యంపై ఉద్యోగుల ఉద్య‌మం…

మంత్రుల క‌మిటీతో ఉద్యోగ సంఘాల నేత‌ల కీల‌క చ‌ర్చ‌ల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. ఉద్యోగుల డిమాండ్ల‌పై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యంపై ఉద్యోగుల ఉద్య‌మం ఆధార‌ప‌డి వుంది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డ‌మా లేక ఉద్య‌మానికి ఊతం ఇస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం మంత్రుల క‌మిటీతో చ‌ర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేత‌లు ముందుకొచ్చారు. ఏపీ స‌చివాల‌యంలో ఇవాళ మ‌ధ్యాహ్నం మంత్రుల క‌మిటీతో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ క‌మిటీ నేత‌లు స‌మావేశం అయ్యారు. అయితే చ‌ర్చ‌ల ఫ‌లితాల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

మంత్రుల కమిటీ ఎదుట మూడు ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల  స్టీరింగ్ కమిటీ ఉంచింది. అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బయటపెట్ట‌డం, పీఆర్సీ జీవోల రద్దు, పాత జీతాలు వేయాలని  స్టీరింగ్‌ కమిటీ ప్రతిపాదనలు చేసింది. ఇదే సంద‌ర్భంలో ఈ నెల 3న ఉద్యోగులు త‌ల‌పెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని మంత్రులు కోరారు. అయితే త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తేనే చ‌ర్చ‌ల విష‌య‌మై ముందుకెళ‌తామ‌ని మంత్రుల క‌మిటీకి ఉద్యోగ సంఘాల నేత‌లు తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల డిమాండ్ల‌పై తాము కూడా చర్చించి మళ్లీ చెబుతామని మంత్రుల కమిటీ పేర్కొంది. అంత వ‌ర‌కూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీకి సూచించింది. ఉద్యోగుల డిమాండ్ల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు వివ‌రించేందుకు మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం దిశానిర్దేశంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. సీఎం సూచ‌న‌లు, నిర్ణ‌యాల‌ను ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు మంత్రుల క‌మిటీ వివ‌రించ‌నుంది.

తిరిగి ఈ ప్ర‌క్రియ ఎప్పుడు మొద‌ల‌వుతుందో, మంత్రుల క‌మిటీ నుంచి పిలుపు ఎప్పుడొస్తుందోన‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ఎదురు చూస్తున్నారు. అంత వ‌ర‌కూ ఎదురు చూపులు త‌ప్ప‌వ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఉద్యోగులు స‌మ్మె బాట ప‌ట్ట‌కుండా నిలువ‌రించేందుకే ప్ర‌భుత్వం మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. దాన్ని ఏ విధంగా ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.