వందేళ్ల కోసం బడ్జెట్… సగటు ఉద్యోగి కోసం కాదు

ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ను రాబోయే వందేళ్ల కోసం దృష్టిలో పెట్టుకొని ప్రకటించినట్టుగా చెప్పుకున్నారు ప్రధాని మోదీ. దీనిపై సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. రాబోయే…

ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ను రాబోయే వందేళ్ల కోసం దృష్టిలో పెట్టుకొని ప్రకటించినట్టుగా చెప్పుకున్నారు ప్రధాని మోదీ. దీనిపై సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. రాబోయే వందేళ్ల కోసం బడ్జెట్ అని చెప్పి, ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సగటు ఉద్యోగని నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు.

ఈ రెండేళ్ల కరోనా కాలంలో దేశవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వాళ్లందరికీ ఉద్దీపన ప్యాకేజీ ఉంటుందని భావించారు. ఇక కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులు కూడా పలు రాయితీలు, అలవెన్సులు ఆశించారు. వీళ్లెవ్వరికీ బడ్జెట్ లో ఊరట లభించలేదు. ఇంకా చెప్పాలంటే.. ఈ ఏడాది బడ్జెట్ వల్ల సగటు ఉద్యోగికి ఎలాంటి ఉపయోగం లేదు.

పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను 50వేల నుంచి కనీసం లక్ష రూపాయలకు పెంచుతారని ఉద్యోగులు భావించారు. ఇలా చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోం ఖర్చుల్ని, టాక్సుల్ని తగ్గించుకోవచ్చని భావించారు. కానీ నిరాశే ఎదురైంది. 

కనీసం స్లాబులు కూడా మార్చకుండా బడ్జెట్ ముగించారు. మరీ ముఖ్యంగా ఏడాది ఆదాయం 10 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులు ఈసారి కొన్ని మినహాయింపులు ఆశించారు. వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు ఆప్షన్లు వాడుకున్నప్పటికీ 30శాతం టాక్సు స్లాబు కింద వీళ్లు ఉన్నారు.

ఈ ఏడాది బడ్జెట్ లో సరికొత్త శాలరీ స్ట్రక్చర్ ను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ, ఆర్థిక శాఖ గొప్పలు చెప్పుకుంది. ఉద్యోగుల పన్నులు, వేతనాల్లో విప్లవాత్మక మార్పులు చూస్తారని ఊరించారు. ఈ మేరకు పలువురు ప్రతినిధులు, పలు కంపెనీలతో చర్చలు కూడా ప్రారంభించారు. కట్ చేస్తే, బడ్జెట్ లో అసలు ఆ ప్రస్తావనే లేకుండా పోయింది.    

ఇంకా చెప్పాలంటే, ఇవాళ్టి బడ్జెట్ లో ఉద్యోగులకు ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపులు లేవు. ఉన్నంతలో ఇచ్చిన వెసులుబాటు ఏదైనా ఉందంటే అది ఐటీ రిటర్న్స్ లో వెసులుబాటు మాత్రమే. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సవరణలు ఏమైనా ఉంటే రెండేళ్ల వరకు అలాంటి సవరణలు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.