ఉరుములేని పిడుగులా ప్రకటనలు చేసే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ మధ్యకాలంలో ముందస్తు ముహూర్తాలను ప్రకటించి రంగంలోకి దిగుతున్నారు. మార్చి నెలలో లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు కొన్ని గంటల ముందు మోడీ ప్రసంగానికి సంబంధించిన విషయాన్ని ప్రకటించారు.
ఆ తర్వాత మూడు వారాలకు ఒకసారి మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్ డౌన్ ల గురించి ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో మోడీ మాట్లాడారు.ఆ తర్వాత ఆయన కరోనా అంశం గురించి స్పందించలేదు. ప్రజలను ఉద్దేశించి ప్రకటనలు ఏవీ చేయలేదు. మన్ కీ బాత్ లలో వేరే అంశాల గురించి స్పందించారు.
నెమలికి ఆహారం వేయడం, ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవడం, దేశీ కుక్కలను పెంచుకోవడం.. వంటి అంశాల గురించి మోడీ ముచ్చట్లు పెట్టారు. ఆ విషయంలో విమర్శలు తప్పలేదు. ఆకలి గురించి మాట్లాడాల్సిన దశలో మోడీ ఫిట్ నెస్ గురించి మాట్లాడుతున్నారని కొందరు ఎద్దేవా చేశారు. ఇక నెమలికి గింజలు, పుస్తకాలు, లాప్ లాప్ అన్నీ ఒకే చోట పెట్టుకుని ఫొటోలు దిగడంపై కాంగ్రెస్ వాళ్లు విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో మోడీ ఈ రోజు సాయంత్రం మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్న విషయాన్ని ప్రకటించారు. సరిగ్గా ఆరు గంటలకు మోడీ ప్రసంగం ఉండబోతోంది. మరి ఏదైనా షాకిచ్చే ప్రకటన చేయబోతున్నారా? లేక పండగల నేపథ్యంలో కోవిడ్-19 నుంచి కాపాడుకోవడం గురించి హితోపదేశం చేస్తారా.. అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.