ఉక్కు పోరాటం మీద సినిమా

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తారన్న అంశం ఇపుడు అందరినీ కదిలిస్తోంది. ఎక్కడెక్కడి వారూ విశాఖ వస్తున్నారు, మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఉక్కు సత్యాగ్రహం…

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తారన్న అంశం ఇపుడు అందరినీ కదిలిస్తోంది. ఎక్కడెక్కడి వారూ విశాఖ వస్తున్నారు, మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఉక్కు సత్యాగ్రహం పేరు మీద సినిమా తీస్తున్నట్లుగా చిత్ర కధానాయకుడు, నిర్మాత, దర్శకుడు పి సత్యారెడ్డి చెప్పారు.

విశాఖ ఉక్కు అంటే పరిశ్రమ మాత్రమే కాదు, అది ఒక త్యాగం, ముప్పై రెండు మంది ఉద్యమకారుల బలిదానం. విశాఖ ఉక్కు జాతీయ సంపద, మనదైన వారసత్వం, దాన్ని అమ్మడానికి ఎవరు తెగించినా ఊరుకోమని చెప్పారు.

తమ చిత్రంలో ఉక్కు కర్మాగారం ఎందుకు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అన్న దాని మీద పూర్తిగా వివరిస్తామని అంటున్నారు. ఈ సినిమాకు గద్దర్, వందేమాతరం శ్రీనివాస్, సుద్దల అశోక్ తేజ,  గోరేటి వెంకన్న వంటి వారు పనిచేస్తారు, వారు ఈ సినిమాలో పాటలను ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటున్నారని చెప్పారు.

విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానీయ్యమని, దాని కోసం కళాకారులుగా జనాలను చైతన్యం చేస్తామని కూడా చెబుతున్నారు. నాటి ఉప్పు సత్యాగ్రహమే స్పూర్తిగా ఉక్కు సత్యాగ్రహం మూవీని తీస్తున్నామని సత్యారెడ్డి వెల్లడించారు. మొత్తానికి ఈ సినిమాతో ఉక్కు ఉద్యమం  మరింతగా వెలుగులోకి రానుందని  కార్మిక సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.