ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమయార్‌పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నిమ్మగడ్డకు ముద్రగడ లేఖ రాశారు.
కాపు హక్కులు, రిజర్వేషన్‌పై ఎక్కువగా, మిగిలిన రాజకీయ అంశాలపై చాలా తక్కువగా స్పందించే ముద్రగడ …ఎస్ఈసీ వ్యవహార శైలిపై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారం చూస్తుంటే అదృశ్య శక్తి ఏదో వెనక నుండి నడిపిస్తోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ చేస్తున్న దాడిని మీడియా ద్వారా తెలుసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
ఉద్యోగిగా రాజకీయాలు చేయడం మంచిది కాదని నిమ్మగడ్డకు హితవు చెప్పారు. ప్రస్తుతం ఎస్ఈసీ, ఏపీ సర్కార్ మధ్య నెలకున్న అవాంఛనీయ పరిస్థితులు భారతదేశంలోనే మొదటిసారి చూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు మంచి చేసే పనులు చేయాలని, అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని నిమ్మగడ్డకు ముద్రగడ సూచించారు. రాష్ట్ర పరిస్థితిని చూసుకుని ఎన్నికలు నిర్వహించాలే తప్ప రాజకీయ నాయకుల్లా పట్టుదలకు పోవడం మంచిగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిమ్మగడ్డ రచ్చ చేయడం మానాలని విజ్ఞప్తి చేశారు.