కథా రచన చార్లీ చాప్లిన్, సంగీతం చార్లీ చాప్లిన్, దర్శకత్వం చార్లీ చాప్లిన్, నిర్మాణం చార్లీ చాప్లిన్, ప్రధాన పాత్రలోనూ చార్లీ చాప్లిన్ నటించగా.. గత శతాబ్దకాలంగా ప్రపంచాన్ని అలరిస్తున్న సినిమా 'ది కిడ్'. చాప్లిన్ మానవతా హృదయాన్ని ఆవిష్కరించి, ఆయనను వరల్డ్ మెగాస్టార్ గా నిలిపిన సినిమా 'ది కిడ్'.
గంట సేపు వ్యవధితో రూపొందిన ఈ మూకీ డ్రామా వందేళ్లు అయినా.. ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఎంతో సాంకేతికత, మరెంతో నవ్యత ఆవిష్కృతం అయినా.. ప్రత్యేకంగానే నిలిచిపోతుంది. ఇప్పటికి వందేళ్లు, మరో వందేళ్లు అయినా.. ఈ సినిమా అప్పుడే కొత్తగా చూసే ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది! అంతటి మహత్తర శక్తి కలిగిన సినిమా చిట్టి సినిమా ఇది.
1921 జనవరి 21న న్యూయార్క్ సిటీలో తొలిసారి థియేటర్లో ప్రదర్శితం అయ్యింది 'ది కిడ్'. ఈ సినిమాకు అంతా తనయ్యాడు చాప్లిన్, అయినా సినిమా టైటిల్ 'ది కిడ్' గానే పెట్టాడు. తను ట్రాంప్ రోల్ లో కనిపిస్తూ.. రెండు ప్రధాన పాత్రలతో అద్భుతమైన సినిమాను రూపొందించాడు.
గత కొన్ని దశాబ్దాల్లో సినిమాల గురించి విశ్లేషించడానికి బోలెడన్ని అంశాలుంటాయి. మాటలు, పాటలు, సంగీతం, కెమెరా, ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్, సెట్టింగ్స్.. ఇలా బోలెడన్ని సాంకేతిక, సృజనాత్మక అంశాల గురించి ప్రస్తావిస్తూ సినిమాలను విశ్లేషిస్తూ ఉంటారు విశ్లేషకులు. ప్రేక్షకులకు కూడా పెద్ద తెరపై సినిమాలను చూస్తున్నప్పుడు వీటిల్లో ఏదో ఒకటి మాయలా ఆవరించి ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇన్ని హంగులూ, ఆర్భాటాలు, అవకాశాలు ఉన్న.. వేళ ఎలాంటి క్లాసిక్స్ వస్తున్నాయో చూస్తున్నాం. ఏ సినిమా అయినా వారానికి మించి వార్తల్లో ఉండదు, వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమా కూడా ఏడాదికి మించి ఊసులో ఉండదు! సినిమా చాలా పవర్ ఫుల్ మాధ్యమం అయిన వేళే.. అంతంత మాత్రపు సినిమాలు వస్తుంటే, ప్రపంచానికి సినిమా టెక్నాలజీ గురించి తెలిసిందే అంతంత మాత్రం అయిన సందర్భాల్లో వచ్చి.. ప్రపంచంపై సినిమా ఆర్ట్ ఫామ్ లో అబ్సల్యూట్ క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమా 'ది కిడ్'.
పంచ్ లు, ప్రాసలు, విరుపులతో ఉండే డైలాగుల రోజులు కావవి. జస్ట్ మూకీ సినిమా. సీన్ కు అనుగుణంగానో, భారీ ఎలివేషన్లతోనో వినిపించే సంగీతం కాదు. పియానో ప్లేయర్ మీద వాయించినట్టుగా మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది. అద్భుతమైన సీనరీలు, చూడచక్కని లొకేషన్లు కాదు.. చెత్తకుప్పలు, పాడుబడ్డ చిన్న ఇల్లు..ఇవే ఈ సినిమా లొకేషన్లు. చిరిగిన కోటు, దుమ్ముపట్టిన దుస్తులు.. వీటిల్లోనే ప్రధాన పాత్రలు కనిపిస్తాయి. మొహాలకు మేకప్ అవసరం లేని బికారి పాత్రలవి! ఆపై బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించిన సినిమా.
ప్రస్తుతం సినిమాలకు హంగులుగా, అర్భాటాలుగా చెప్పబడుతున్న ఏ ఒక్క అంశం నుంచి పరిశీలించి చూసినా 'ది కిడ్' ఎందుకూ కొరగాని సినిమానే! అయితే.. ఇది హృదయాన్ని స్పృశిస్తుంది. కథ, కథనం.. వీటికి తోడు నటీనటుల ప్రతిభాపాటవాలతో ఈ సినిమా గుండెకు హత్తుకుండి పోతుంది. కామెడీ సినిమానే అయినా.. అనేక సందర్భాల్లో ఏడిపిస్తుంది.
చిన్నపిల్లాడి తో ముడిపడిన సీన్లు మనం మనుషులమనే విషయాన్ని గుర్తించేలా చేస్తాయి. ఇంతటి మానవతావాదాన్ని ఆవిష్కరించిన చాప్లిన్ కు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. వందేళ్ల కిందట ఇంతటి గొప్ప భావోద్వేగాలను సినిమా ఆర్ట్ ఫామ్ లో ఆవిష్కరించిన ఆ దర్శకుడి ప్రతిభకు హ్యాట్సాఫ్ చెబుతూనే ఉంది ప్రపంచం వందేళ్లుగా! దర్శకుడిగా ఎంత అందమైన సినిమాను కలగన్నాడో, నటుడిగా తన స్వప్నాన్ని తెరపై చూపించి చాప్లిన్ వరల్డ్ మెగాస్టార్ గా అవతరించాడు.
ప్రపంచ సినిమాలతో ఎంతో మంది నటులు రావొచ్చు, మరెంతో మంది దర్శకులు, మేధావులు రావొచ్చు. ఈ విషయంలో ఒకరిని మించి మరొకరి స్థాయి గురించి ప్రేక్షకుల్లోనూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఫలానా దర్శకుడి కన్నా మరో దర్శకుడు గొప్ప అని, ఇంకో నటుడి కన్నా మరో నటుడు తోపు అని.. ఈ వాదనలు ఎప్పుడూ ఉంటాయి. అయితే చాప్లిన్ లాంటి నటుడు మళ్లీ ఇంత వరకూ రాలేదు. ఇక రాడు కూడా.
తన అమాయక చేష్టలు, చూపులతో ప్రపంచాన్ని కట్టిపడేసే శక్తి మరొకరికి ఇప్పటి వరకూ రాలేదు! ఒకే తరహా పాత్రలో అనేక దఫాలుగా కనిపించి కూడా ప్రతిసారీ ఒకటే స్థాయి మాయ చేయడం చాప్లిన్ కు తప్ప మరొకరికి సాధ్యం కాలేదు. కాదు కూడా.
ఇండియాలో చాప్లిన్ కు ఉన్న క్రేజ్ వేరే చెప్పనక్కర్లేదు. మన దగ్గర సోకాల్డ్ సూపర్ స్టార్లు కూడా.. చాప్లిన్ రూపంలో కాసేపైనా కనిపించి తృప్తి పొందిన వాళ్లే. కమల్ హాసన్ చాప్లిన్ వేషంలో, చాప్లిన్ అనుకరణతో కొన్ని సినిమాల్లో కనిపిస్తాడు. 'డ్యాన్స్ మాస్టర్' అనే సినిమాలో ఒక పాత్ర పూర్తిగా చాప్లిన్ వేషంలో సాగుతుంది. చిరంజీవి, కృష్ణ లాంటి వాళ్లు కూడా కాసేపైనా చాప్లిన్ వేషంలో కనిపించి అలరించే ప్రయత్నం చేశారు. బహుశా చాప్లిన్ ను అనుకరించే ప్రయత్నం చేసినట్టుగా ప్రపంచంలో మరే నటుడి విషయంలోనూ జరగలేదు.
నటుడిగా చాప్లిన్ ఒక ఎత్తు అయితే.. తన రచన, దర్శకత్వాలతో మరెవ్వరూ అందుకోలేని ఎత్తు! ప్రత్యేకించి మానవతావాదాన్ని చాప్లిన్ సృజించినట్టుగా మరో దర్శకుడెవ్వరూ తెరకెక్కించలేదు. శాంతి, ప్రేమ, అప్యాయతలను పంచడమే మనిషి అంతిమ లక్ష్యం.
అధునాతన ఆవిష్కరణలతో జీవితాన్ని సుఖమయం చేసుకో.. అంతే కానీ వినాశానానికి సాంకేతితను అభివృద్ధి పరచవద్దు.. అనే సందేశాలను ఇస్తూ ..సినిమాలను రూపొందించి వాటితో ఆకట్టుకోవడం చాప్లిన్ కే సాధ్యం అయ్యింది. సినిమాలు సందేశాలను ఇస్తే ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారు. అయితే చాప్లిన్ సందేశాలు మాత్రం హృద్యంగా ఉంటాయి.
మరోసారి వినాలనిపించేలా ఉంటాయి. 'ది గ్రేట్ డిక్టేటర్' క్లైమాక్స్ లో చాప్లిన్ చేసే ప్రసంగం.. బెస్ట్ ఎవ్వర్ సినిమా స్పీచ్ గా నిలుస్తుంది. ఒకటని కాదు.. చాప్లిన్ ఒక అద్భుత మానవుడు, అద్భుత సినీ సృజనకర్త.
'ది కిడ్' విషయానికి వస్తే.. చాలా చిన్న కథ. అద్దాలను ఫిట్ చేసే పని చేసుకునే ట్రాంప్ కు ఒక కుప్ప తొట్టెలో చిన్న పిల్లాడు దొరుకుతాడు. వివాహం లేకుండానే పిల్లాడిని కన్న ఒక మహిళ పోషించే శక్తి లేక వదిలించుకుని ఉంటుంది.
ట్రాంప్ కూడా ఆ పిల్లాడిని వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే తన తింగరి తనంతో.. అది సాధ్యం కాదు. తప్పక ఆ పిల్లాడిని తన వెంట పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ కట్ చేస్తే.. పిల్లాడు కాస్త పెద్దయ్యాకా సీన్లతో సినిమా సాగుతుంది.
తనకంటూ ఎవ్వరూ లేని ట్రాంప్ ఆ పిల్లాడితో అనుబంధం పెంచుకుంటాడు. ఒకరని వదిలి మరొకరు ఉండలేనంత దగ్గరవుతారు. తల్లితండ్రి లేని లోటు లేకుండా పిల్లాడిని పెంచుకుంటూ ఉంటాడు ట్రాంప్.
ఇళ్ల కిటికీలకు పగిలిన అద్ధాలను ఫిట్ చేసే పని చేస్తూ ఉండే ట్రాంప్, తనకు గిరాకీ లు లేని సమయంలో పిల్లాడిని పంపించి ఇళ్ల అద్దాలను రాళ్లతో పగలగొట్టిస్తుంటాడు. ముందు కిడ్ వెళ్లి అద్దాలను పగలగొట్టడం ఆ తర్వాత అదే వీధిన వెళ్లి ట్రాంప్ బేరం కుదుర్చుకుని అద్దాలను ఫిట్ చేయడం.. సరదాతో కూడిన ఈ సీన్లతో వారి మనుగడ సాగుతుంది.
ట్రాంప్ దగ్గర ఉన్న పిల్లాడిపై పోలీసుల కన్ను పడుతుంది. ట్రాంప్ ఉన్న పరిస్థితుల్లో చిన్న పిల్లాడిని అతడి వద్ద ఉంచుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ నియామాలు చెబుతాయి. అతడిని ప్రభుత్వానికి అప్పగించాలని పోలీసులు స్పష్టం చేస్తారు. అయితే ట్రాంప్ దానికి నిరాకరిస్తాడు. అయితే పోలీసులు బలవంతంగా పిల్లాడిని తీసుకెళ్లిపోతారు. వారితో పోరాడి పిల్లాడిని మళ్లీ తన వద్దకు తీసుకుని పారిపోతాడు.
అప్పటికే పిల్లాడిని కన్న తల్లి కాస్త సెటిలై ఉంటుంది. పిల్లాడిపై మమకారం చంపుకోలేక, ఎక్కడున్నాతో తెలియక.. పేపర్లో ప్రకటన ఇస్తుంది. పిల్లాడిని తనకు తెచ్చిస్తే పారితోషికం ఇస్తానంటుంది. పోలీసుల నుంచి తప్పించుకుని పిల్లాడితో రోడ్డున పడ్డ ట్రాంప్ ఒక రాత్రి బసకు వెళ్తాడు. దాని యజమాని పేపర్లో ప్రకటనను చూసి.. రాత్రి వేళ ఆ పిల్లాడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాడు. లేచి చూస్తే తన కిడ్ లేని విషయం ట్రాంప్ కు అర్థం అవుతుంది.
వెదుకుతూ తన ఇంటికి చేరుకుని అలసిపోయి మెట్ల మీదే కూలబడతాడు. ఆ నిద్రలో అందమైన కల వస్తుంది. ఆ కలలో కూడా కిడ్ తలంపే! ఒక పోలీసాఫీసర్ వచ్చి నిద్ర లేపుతాడు. తనతో పాటు రమ్మంటాడు.
తప్పించుకునే అవకాశం లేక భయంభయంగా పోలీసాఫీసర్ ను అనుసరించే ట్రాంప్ ఒక ఇంటికి చేరుకుంటాడు. అక్కడ పిల్లాడు, అతడి తల్లి ఉంటారు. తను చెత్తకుప్ప వద్ద పడేసిన పిల్లాడిని ఆదరించినందుకు ఆ తల్లి ట్రాంప్ కు కృతజ్ఞతలు చెప్పుకుని, తమతో పాటు ఉండమని ట్రాంప్ ను కోరడంతో సినిమా హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది.
ఈ మూకీ కామెడీలో కళ్లను తడి చేసే సన్నివేశాలుంటాయి. ప్రత్యేకించి పిల్లాడిని పోలీసులు ట్రాంప్ నుంచి వేరు చేసే సన్నివేశాల్లో చాప్లిన్, కిడ్ నటన చమర్చేలా చేస్తుంది. అద్దాలను పగలగొట్టే సీన్లు కామెడీకి నిర్వచనంగా నిలిచిపోతాయి.
ఇప్పటికీ టీవీ చానళ్లలో 'ది కిడ్' తరచూ ప్రసారం అవుతూ ఉంటుంది. అలాగే ఫేస్ బుక్ లో ఈ సినిమాలోని సీన్లు వీడియోలుగా వైరల్ అవుతూ ఉంటాయి. వందేళ్లు అయినా సోషల్ మీడియా జనరేషన్ ను కూడా ఆకట్టుకుంటూ ది కిడ్ తన మహత్తర శక్తి ఏమిటో చాటుకుంటూ ఉంది.
-జీవన్ రెడ్డి.బి