ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారే తను ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారనుకోవాలి. తన ఎన్నికల ప్రణాళికలో కాని, పాదయాత్రలో కాని జగన్ ఇచ్చిన హామీలకు చట్టం రూపం తీసుకురావడానికి అప్పుడే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు వాగ్ధానాల అమలుకు తేదీలు కూడా నిర్ణయించిన జగన్ ఇప్పుడు బిల్లుల ఆమోదానికి సిద్ధం అయ్యారు. అందులో ముఖ్యమైనవి మూడు ఉన్నాయి. డెభ్బై ఐదుశాతం ఉద్యోగాలను ఆయా సంస్థలు స్థానికులకే ఇవ్వాలన్న బిల్లు, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులలోను, నామినేటెడ్ కాంట్రాక్టులలోను ఏబైశాతం కేటాయించాలని, మహిళలకు కూడా సగభాగం పదవులు ఇవ్వాలని తీసుకువచ్చిన బిల్లులు నిజంగానే చరిత్రాత్మకమైనవే.
ఆంధ్ర సమాజంలో ఇది పెనుప్రభావం చూపే అవకాశం ఉంటుంది. డెబ్బై ఐదుశాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న చట్టం వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగులకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్నది ప్రభుత్వం భావన. అయితే ఇది అనుకున్నంత తేలికైన విషయం కాదనే చెప్పాలి. దీనిని చట్టం చేసినంత మాత్రాన అంతా అమలు అయిపోతుందని అనుకోవడానికి లేదు. ముందుగా కొత్తగా వచ్చే పరిశ్రమలకు ఇక్కడ స్థాపిస్తే వచ్చే రాయితీలపై నమ్మకం కలిగించాలి. ఏపీలోనే అయితేనే తమ పరిశ్రమకు మేలు కలుగుతుందన్న భావన ఏర్పడాలి.
భూమి, విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాల విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి సజావుగా దొరికితే పరిశ్రమలు పెట్టేవారు ఏ చట్టాన్ని అయినా భరిస్తారు. పాటిస్తారు. అయితే సాంకేతిక పరంగా స్థానికులకు ఆయా పరిశ్రమలు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. దానికి కూడా విస్తారంగా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. శిక్షణకు కూడా ప్రోత్సహాకాలు అవసరం కావచ్చు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించవలసిన అవసరం ఉంది.
ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి కేంద్రం ఇవ్వలేదు. ఆ నేపధ్యంలో ఏపీ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ముందుగా పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో ఏపీకి వచ్చేలా ముఖ్యమంత్రి జగన్ కృషి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఈ బిల్లును అమలు చేయవచ్చు. అలాగే ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నామినేటెడ్ పదవులలో ఏభైశాతం పదవుల, ఏభైశాతం నామినేటెడ్ పనులు ఇవ్వాలన్న బిల్లు కూడా సామాజికంగా చూస్తే విప్లవాత్మకమైనది.
సమాజంలో పెద్దఎత్తున మార్పునకు ఇది దోహదపడుతుంది. దీనిపై కొన్ని అగ్రవర్ణాలలో ఒకింత అసంతృప్తి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానిని కూడా సర్ధుబాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఒకప్పుడు ఇంధిరాగాంధీ గరీబీ హటావో నినాదంతో దేశం మొత్తాన్ని కుదిపేశారు. అదే సమయంలో కొన్నివర్గాల నుంచి ఆమె వ్యతిరేకత ఎదుర్కున్నారు. కాని జన సామాన్యం మొత్తం ఆమె వెంటే ఉన్నారు. అలాగే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం, వెంటనే బిల్లు రూపంలో తీసుకువస్తున్న తీరును ఎవరూ తప్పుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ హామీలన్ని జగన్ తన పాదయాత్రలో ఇచ్చినవే.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విషయాలే. వాటికి జనామోదం లభించింది. అందువల్లే జగన్‌కు అంత భారీఎత్తున సీట్లు వచ్చాయి. అయితే నామినేటెడ్ కాంట్రాక్టు పనులలో ఏభైశాతం పనులు బలహీనవర్గాలకు ఇవ్వడం తప్పుకాదు. కాని వారికి ఈ విషయంలో ఆసక్తి కలిగించడం, ఆర్థిక వనరులు కలిగించడం, అసవరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం, తద్వారా పనుల నాణ్యతలో రాజీలేకుండా చూసుకోవాలి. అంతేకాదు.. ఈ పనులలో బినామీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలి.
ఇక నామినేటెడ్ పదవులలో ఏభైశాతం బలహీనవర్గాలకు ఇవ్వడం ద్వారా సమాజంలో వారికి తగు గౌరవం ఇవ్వాలన్నది లక్ష్యంగా ఉంటుంది. జగన్ తన ఎన్నికల హామీలను నెరవేర్చడం కన్నా ఏపీ సమాజంలో సంచలనాత్మక మార్పునకు జగన్ శ్రీకారం చుట్టారని అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా కూడా జగన్‌కు మద్ధతు ఇచ్చిన బలహీనవర్గాలు ఆయన వెన్నంటి ఉండడానికి ఈ కొత్త చట్టాలు అవకాశం కలిగిస్తాయి. ఏది ఏమైనా జగన్ చేస్తున్న ప్రయోగాలు ఏపీ సమాజం అంతటిని ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. ఒక మార్పునకు జగన్ నాందీ పలికారు. ఆ మార్పు సమాజం వైపు సాగుతుందని ఆశిద్ధాం.
-కొమ్మినేని శ్రీనివాసరావు