విద్యాబాలన్ వయసు నలభై సంవత్సరాలు.. ఇటీవలి కాలం నుంచినే సౌతిండియన్ సినిమాలతో బిజీ అవుతోంది. ముప్పై ఆరేళ్ల వయసులో ఉన్న శ్రియ తన నాజూకు తనాన్ని కాపాడుకుంటోంది. అడపాదపడా స్టార్ హీరోల సినిమాల్లో.. అవి లేనప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ ఉంది! ముప్పై నాలుగేళ్ల కాజల్ అగర్వాల్ కు చేతినిండా సినిమాలున్నాయి. తన కన్నా చిన్న వాళ్లైన కుర్రాళ్ల సరసన కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తూ దూసుకుపోతోంది!
ముప్పై ఆరేళ్ల త్రిష ఇప్పుడు తన కెరీర్లో మరపురాని విజయాలను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి తన చిరకాల కోరికను తీర్చుకుంది. కుర్ర వయసులో రాని ఆ అవకాశం ఆమెకు ముప్పై ఆరేళ్ల వయసులో వచ్చింది! నలభై ఒక్క యేళ్ల వయసులో జ్యోతిక మళ్లీ మొహానికి రంగు వేసుకుంటోంది. వివిధ సినిమాల్లో నటిస్తోంది. రేపోమాపో మళ్లీ భర్త సూర్యకు జోడీగా హీరోయిన్ గా నటించడానికి రెడీ అవుతోంది. జ్యోతికకు ఇప్పుడు ఆసక్తిదాయకమైన అవకాశాలు దక్కుతున్నాయి. నలభై యేళ్ల భూమికా చావ్లా కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. వివిధ సినిమాలతో బిజీ అవుతోంది!
అటు గ్లామర్ టచ్.. ఇటు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో కాస్త వయసు వచ్చాకా కూడా ఈ హీరోయిన్లు దూసుకుపోతూ ఉండటం గమనార్హం. వీళ్లంతా ఇప్పటి వాళ్లేమీ కాదు.ఇండస్ట్రీలో వీళ్లు పాతుకుపోయారు! ఇప్పుడు ముప్పై యేళ్ల వయసుకు వచ్చిన కుర్రాళ్లు నిక్కర్లు వేసుకున్నప్పుడు వీళ్లు హీరోయిన్లుగా తెర మీదకు వచ్చారు. అప్పటి నిక్కర్ల కుర్రాళ్లు ఇప్పుడు తండ్రులు అయిపోయినా ఈ హీరోయిన్లు ఇంకా వెండితెర వేల్పులుగా కొనసాగుతూ ఉన్నారు!
అప్పటితో పోలిస్తే ఈ హీరోయిన్ల అందాల బిగి సడలి ఉండొచ్చు. అయితే తెరపై మాత్రం వీరి పట్టు సడలటం లేదు. గొప్ప గొప్ప నటీమణులు ఏమీ కాదు.. అనే విమర్శవీరందరి మీదా కామన్ గానే ఉన్నా.. వీళ్ల హవా మాత్రం ఇప్పటికే కొనసాగుతూ ఉండటమే గమనార్హం!
హీరోల వయసే కారణమా?
ఎప్పుడో 'చెన్నకేశవరెడ్డి'లో బాలకృష్ణతో జత కట్టింది శ్రియ. ఇప్పుడు ముదురు బాలయ్యకు హీరోయిన్ కావాలంటే.. శ్రియ పేరు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. వరసగా ఆమెతోనే సినిమాలు చేయకతప్పడం లేదు బాలయ్యకు. ఇలాంటి హీరోలకు వయసు మీద పడటం, ఇంకా కుర్రాళ్లలా వాళ్లు కనిపించలేకపోవడంతో వారి ఏజ్ కు తగిన హీరోయిన్లను తీసుకోవాల్సి వస్తోంది. బాలకృష్ణతో వీరి వయసు సరిసమానం కాకపోవచ్చు కానీ.. ముదురుగా కనిపించే వాళ్లే ఆ హీరోల పక్కన సెట్ అయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఇలాంటి హీరోయిన్లకు చేతినిండా అవకాశాలు దక్కుతున్నాయని చెప్పవచ్చు.
ఈ ఇబ్బంది కేవలం బాలకృష్ణది మాత్రమే కాదు. చిరంజీవి, రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున.. వీళ్లందరికీ ఈ ఇబ్బంది ఉంది. ఇంకా కుర్ర భామలు, తమ కూతుళ్ల వయసున్న వారితో జత కడితే విమర్శలు వస్తాయనే భయం ఆ హీరోలకు కూడా తప్పడం లేదు. అక్కడకూ కొన్ని సార్లు సాహసం చేసినా ఆ హీరోలు విమర్శల పాలవుతున్నారు. మరీ కూతురు వయసు , మనవరాళ్లకు అక్కల్లా ఉండే అమ్మాయిలతో జత కట్టడం ఏమిటి? అంటూ అన్ని వర్గాల వారూ ఆ హీరోలను విమర్శిస్తున్నారు.
ఆ హీరోలకు మహిళాభిమానులకు లోటు లేదు. ఆ హీరోలు కుర్ర భామలతో నటిస్తే మహిళాభిమానులు ఆమోదించే పరిస్థితి లేదు. తమ హీరో అలా పిల్లలతో ఆడిపాడితే మహిళా ప్రేక్షకులు ఆమోదించలేరు. అంతేగాక ట్రోల్ చేసే వాళ్లు ఎలాగూ రెడీగానే ఉంటారు. రజనీకాంత్ అయినా మరొకరు అయినా కుర్ర భామలతో జతగా కనిపిస్తే సోషల్ మీడియాలో సెటైర్లు తప్పవు. అందుకే హీరోలు జాగ్రత్త పడుతూ ఉన్నారు. అందుకు పరిష్కారామే.. తాము ఒకప్పుడు జత కట్టిన భామలకు ఇప్పుడు మరో ఛాన్స్ ఇవ్వడం. 36 యేళ్ల కిందల శ్రియతో తొలిసారి జత కట్టిన బాలకృష్ణ ఇప్పుడు ఆమెకే మళ్లీ ఛాన్సులు ఇవ్వాల్సి వస్తోంది.
ఎప్పుడో ఒక కాలపు హీరోయిన్ అయిన సిమ్రాన్ తో రజనీకాంత్ మళ్లీ జత కట్టాల్సి వస్తోంది. కాజల్ అయితే ఏజ్ అయిన హీరోల సరసన కూడా ఇంకా కుర్ర పిల్లలానే కనిపిస్తూ ఉంది. దీంతో ఆమెకు యువ హీరోల సరసనా అవకాశాలు వస్తూ ఉన్నాయి! తన కన్నా చిన్న వాళ్లు అయిన హీరోలతో కూడా కాజల్ నటిస్తూ ఉంది. దాదాపు 14 యేళ్ల కిందట కెరీర్ ప్రారంభించిన కాజల్ ఇప్పుడు కూడా చేతినిండా అవకాశాలతో సాగుతూ ఉండటం గమనార్హం.
ఇక విద్యాబాలన్ ను 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం బాలీవుడ్ నుంచి తెచ్చారు. జోరో సైజ్ లు గట్రా పోకుండా తనకు వీలైనట్టుగా ఉండే విద్యకు సౌత్ ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తూ ఉన్నాయి. అజిత్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఇంకా మరికొందరు సౌత్ స్టార్ హీరోల హిట్ లిస్టులో విద్యాబాలన్ ఉందని తెలుస్తోంది. ఇలా ఏజ్ అయిన హీరోయిన్లకు నయనతార కూడా ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఆమె కూడా ౧౧ యేళ్ల కిందట హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నటే. కాబట్టి.. ఏజైన హీరోలకు ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తూ ఉంది.
కొన్నాళ్ల కిందటి వరకూ ఏ హీరోయిన్ కెరీర్ స్పాన్ అయినా తక్కువే అనే అభిప్రాయాలు ఉండేవి. ఎంత స్టార్ హీరోయిన్ అయినా రెండు మూడేళ్లే అని, హీరోయిన్లకు క్రేజ్ ఎక్కువ కాలం ఉండదని, ఒక హీరోయిన్ కాస్త వెలుగులో ఉండగానే మరొకరు స్టార్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఒక్కసారి స్టార్ స్టేటస్ నుంచి దిగిపోతే ఆ తర్వాత రెమ్యూనరేషన్ తగ్గిపోవడం మాట అటుంచి, చేతికి అవకాశాలు కూడా చిక్కేవి కావు. అలా టాలీవుడ్ లో చాలా కాలం పాటు ఒక ట్రెండ్ నడిచింది. 90 లలో చాలా మంది హీరోయిన్ల కెరీర్ లు అలానే ముగిశాయి.
శ్రియ, త్రిష వంటి వాళ్ల కథ కూడా అలానే ఉంటుందని అనుకున్నారు. వీరి హవా రెండు మూడేళ్ల పాటే గట్టిగా వీచింది, ఆ తర్వాత వీళ్లు తెరమరుగు అయిపోయినట్టే అనే అభిప్రాయాలు వినించాయి. అయితే వీళ్లకు హీరోల వయసు కలిసి వస్తోంది. స్టార్ హీరోలు ముసలాళ్లు అయిపోతూ ఉండటంతో ఈ హీరోయిన్లకు కాలం కలిసి వచ్చింది. వారు తప్పనిసరిగా అయినా అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్లకు మరి కొంతకాలం పాటు కూడా తిరుగు లేకపోవచ్చు!
ఎందుకంటే సౌత్ లో స్టార్ హీరోలు మరి కొంత కాలం పాటు తమ తమ కెరీర్ లను కొనసాగించాలని తపిస్తున్నారు. తమ వయసుకు తగిన పాత్రలతో, తమ వయసు మీద సెటైర్లు వేయించుకుంటూ అయినా వాళ్లు హీరోలుగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ హీరోయిన్లకు కూడా మరి కొంత కెరీర్ మిగిలే ఉన్నట్టే. అందుకు తగ్గట్టుగా వీళ్లలో కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు, ఇంకొందరు పెళ్లి చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తూ ఉన్నారు.
కేవలం సౌత్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. మళ్లీ పాత నీరే అక్కడ రాజ్యం ఏలుతోంది. ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ వంటి ముదుర్లే స్టార్ హీరోలకు దిక్కు అవుతున్నారు. అక్కడా స్టార్ హీరోలకు వయసు మీద పడింది మరి. ఏజైన భామలకే అక్కడా క్రేజ్ నడుస్తోంది!