వకీల్‌సాబ్ పవన్‌కల్యాణ్‌కు మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న గుడివాడ జంక్షన్లో జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానిపై పంచ్ డైలాగ్‌లతో విరుచుకుపడ్డారు. సినిమా డైలాగ్స్‌తో నిన్నటి పవన్ కల్యాణ్ పర్యటన ఆద్యంతం రక్తి కట్టించింది.
‘ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి? నానియా? వైసీపీలో నానీలు ఎక్కువ మంది. ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం. అనేక మంది నానిలలో ఒక నాని. ఎవరైతే మనకేంటి? శతకోటి నానిలలో ఒకరైన నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్‌కు చెప్పండి.
జగన్ రెడ్డి గారికి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం’ అని పవన్ వెటకారంతో కూడిన హెచ్చరిక చేశారు.
పవన్ హెచ్చరికపై కొడాలి నాని మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా నాని మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు చెప్పారు.
‘ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు బయటకు వచ్చి వకిల్ సాబ్ చెప్పాడు అని చెప్పామంటున్నావ్. నిన్ను నువ్వు వకీల్ సాబ్ అని అనుకుంటుంటే జనం మాత్రం షకీలా సాబ్‌గా భావిస్తున్నారని తెలుసుకోవాలి.
ఈ రాష్ట్రంలో పార్టీలు పెట్టి రెండు చోట్ల ఓడిపోయిన అధ్యక్షులు ప్యాకేజీకి మాత్రమే పనికి వస్తారు’ అంటూ నాని విరుచుకుపడ్డారు. పవన్‌కల్యాణ్ పదేపదే తానెవరికీ భయపడనని చెబుతున్నారని, అసలు ఎవరు భయపడమని చెప్పారని ఆయన ప్రశ్నించారు.
పవన్ సినిమాలతో తమకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. పవన్ సినిమాలు చేసుకుంటే లేదా చేసుకోకపోతే తమకేం సంబంధమని ఆయన అన్నారు. సినిమాల్లో నటించడం మానేయాలని తామేమీ అడగలేదు కదా అని పవన్‌ను ఉద్దేశించి నాని అన్నారు.
తాము ఇప్పుటికి సినిమా యాక్టర్‌గానే పవన్‌ను చూస్తున్నట్టు తెలిపారు. పవన్‌కు ప్యాకేజీ వచ్చినట్టుందని, అందుకే బయటకు వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని ఒక వైపు.. సొంత పుత్రుడుని మరో వైపు కృష్ణా జిల్లాలోకి నిన్న పంపించాడని కొడాలి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జోగిజోగి రాసుకుంటే బూడిద రాలిన చందంగా పవన్, లోకేశ్ పర్యటనలు ఉన్నాయని నాని ఎద్దేవా చేశారు.
ఇక తమను బోడి లింగమని పవన్ అంటున్నాడని , కానీ తమకు ఏ మతమైనా గౌరవం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. శివ లింగాలని బోడి లింగంగా అభివర్ణించడం ఆయన సంస్కారానికి అద్దం పడుతోందన్నారు.
రాజకీయ పార్టీలు పెట్టి వ్యాపారం చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన వ్యక్తి పవన్ అని నాని విమర్శించారు. ఇలాంటి రాజకీయ పార్టీలు చాలా వచ్చి కాలగర్భంలో కలిపోయాయన్నారు. జనసేనానిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పోల్చారు.
తెలుగుశాంతి ప్రపంచ అధ్యక్షుడిగా కేఏ పాల్, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడిగా పవన్‌కల్యాణ్ ఉంటే సరిపోతుందని కొడాలి నాని చమత్కరించారు. మొత్తానికి నిన్న తనపై మాటల తూటాలు పేల్చిన వకీల్‌సాబ్‌కు, నేడు ఘాటైన విమర్శలతో ఏకీలుకా కీలు విరగ్గొట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.