లోకేష్ డ్యామేజ్ కంట్రోల్ య‌త్నాలు.. మామూలుగా లేవే!

అచ్చెన్నాయుడు వీడియోతో తెలుగుదేశం పార్టీలో అంత‌ర్గ‌త ప‌రిస్థితి ఏమిటో తేట‌తెల్లం అయ్యింది. లోకేష్ పై తెలుగుదేశం నేత‌ల్లో ఏ మాత్రం న‌మ్మ‌కం లేదు. లోకేష్ ను ఇష్టానుసారం మాట్లాడ‌టానికి కూడా తెలుగుదేశం నేత‌లు వెనుకాడటం…

అచ్చెన్నాయుడు వీడియోతో తెలుగుదేశం పార్టీలో అంత‌ర్గ‌త ప‌రిస్థితి ఏమిటో తేట‌తెల్లం అయ్యింది. లోకేష్ పై తెలుగుదేశం నేత‌ల్లో ఏ మాత్రం న‌మ్మ‌కం లేదు. లోకేష్ ను ఇష్టానుసారం మాట్లాడ‌టానికి కూడా తెలుగుదేశం నేత‌లు వెనుకాడటం లేదు. ఆ పై ఆర్థిక బేర‌సారాల్లో కూడా లోకేష్ పార్టీ మ‌నుషుల ద‌గ్గ‌ర కూడా చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్న దాఖ‌లాలు ఆ వీడియోతో బ‌య‌ట‌ప‌డ్డాయి. 

త‌న‌కు రావాల్సిన ఆరు కోట్ల రూపాయ‌ల‌ను ఇప్పించాలంటూ.. లోకేష్ చుట్టూరా తిరుగుతున్న‌ట్టుగా ఆ వీడియోలో ఒక వాయిస్ గ‌ట్టిగా చెబుతోంది. చంద్ర‌బాబు అనుకుంటే ఆ ప‌ని జ‌రిగిపోతుంద‌ని, అయితే లోకేష్ కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌న‌ను దొంగ‌ను చూసిన‌ట్టుగా చూస్తున్నాడంటూ ఆ వ్య‌క్తి గోల పెట్టాడు. ఆ మాట‌ల‌ను వింటే.. పార్టీకి అయిన వారి మ‌ధ్య‌నే ఫైనాన్షియ‌ల్ సెటిల్మెంట్ల‌లో లోకేష్ జోక్యం ఉంద‌నే అభిప్రాయాలు ఏర్ప‌డుతూ ఉన్నాయి. 

ఇప్ప‌టికే అనేక ర‌కాలుగా అభాసుపాల‌య్యారు నారా లోకేష్. ఎమ్మెల్యేగా ఓడిపోవ‌డం, మాట్లాడే ప‌ద్ధ‌తి ఇప్ప‌టికీ అల‌వాటు కాక‌పోవ‌డం లోకేష్ కు పెద్ద మైన‌స్ లు. ఈ క్ర‌మంలో పార్టీలో ఆయ‌న‌కు గౌర‌వం లేదు, పార్టీ లోని వారి ఆర్థిక వ్య‌వ‌హారాల్లో కూడా లోకేష్ వేలు పెడుతున్నాడు. 

తిరుప‌తి ఉప ఎన్నిక ముగిస్తే తెలుగుదేశం కార్య‌క‌లాపాలు మ‌రింత ఢీలా ప‌డ‌బోతున్నాయ‌ని అచ్చెన్నాయుడి మాట‌ల‌తో బ‌య‌ప‌డ‌టం.. లోకేష్ పై పార్టీలో న‌మ్మ‌కం లేద‌నే అభిప్రాయాలు ఏర్ప‌డ‌టం స‌హ‌జంగానే జ‌రుగుతోంది. ఇలాంటి నేప‌థ్యంలో లోకేష్ డ్యామేజ్ కంట్రోల్ య‌త్నాలు మొద‌లుపెట్టారు.

తిరుప‌తిలో అలిపిరి వ‌ద్ద లోకేష్ ఏదో ర‌చ్చ చేస్తున్నార‌ట‌. వైవెస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌తో త‌న కుటుంబీకుల‌కు ఎవ‌రికీ సంబంధం లేద‌ని లోకేష్ ప్ర‌మాణం చేశార‌ట‌, సీఎం వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చి కూడా అలాగే ప్ర‌మాణం చేయాల‌ట‌. త‌ను అలిపిరిలో ఉన్న‌ట్టుగా, అక్క‌డ‌కు జ‌గ‌న్ రావాల‌న్న‌ట్టుగా లోకేష్ ప‌చ్చ‌మీడియా ద్వారా వ‌ర్త‌మానం పంపించారు!

ఇవే కామెడీలంటే! వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగింది చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న‌ప్పుడు. అప్ప‌టికి ఇంకా ఎన్నిక‌ల‌కు ఇంకా నెల రోజుల స‌మ‌యం ఉండ‌నే ఉండింది. జ‌గ‌న్ ప్ర‌మేయ‌మో, జ‌గ‌న్ కుటుంబీకుల ప్ర‌మేయ‌మో ఉండి ఉంటే.. చ‌క‌చ‌కా అరెస్టులు చేయించ‌డం చంద్ర‌బాబుకు ఏ మాత్రం క‌ష్టం కాదు! జ‌రిగింది స్వ‌యంగా జ‌గ‌న్ బాబాయి హ‌త్య కాబ‌ట్టి, అందులో వారి ఇన్ వాల్వ్ మెంట్ ఉంద‌ని, వారు బ‌య‌ట తిర‌గ‌డానికి వీల్లేద‌ని అప్పుడే చంద్ర‌బాబు నాయుడు వారిని అరెస్టు చేయించి ఉండొచ్చు. 

అన్ని అధికారాలూ అప్పుడు వారిచేతిలోనే ఉన్నాయి. అది కూడా కీల‌క‌మైన స‌మ‌యంలో వైఎస్ కుటుంబీకులు ఎవ‌రైనా అలా దొరికితే చంద్ర‌బాబు నాయ‌డు వ‌దులుకునే ర‌కం కూడా కాదు! కానీ ఆ నెల రోజులూ.. అలాంటి అరెస్టులు, స‌రైన విచార‌ణ లేదు! ఇప్పుడు త‌న కుటుంబం ప్రమేయం లేదంటూ లోకేషుడు కామెడీ ప్ర‌మాణాలు చేస్తున్నారు! 

ఆదినారాయ‌ణ రెడ్డికో, బీటెక్ ర‌వికో సంబంధం లేద‌ని లోకేష్ ప్ర‌మాణం చేయాల్సింది కానీ, నారా భువ‌నేశ్వ‌రికి, నారా బ్ర‌హ్మ‌ణికి, బాల‌కృష్ణ‌కు సంబంధం లేదంటే ఎలా? అయినా.. వీడియోతో లోకేష్ గాలి పోయింది. అది పంచ‌రేస్తే పూడేది కాదు. అందుకే లోకేష్ ఇలా స‌మ‌యం సంద‌ర్భం లేకుండా ప్ర‌మాణాల‌కు పూనుకున్నారు, అవి కూడా ఆయ‌న రొటీన్ కామెడీనే త‌ల‌పిస్తూ ఉండ‌టం కొస‌మెరుపు!